WPL 2023, RCB-W vs MI-W:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రదర్శన రోజుకొకలా ఉంటోంది! ఒకసారి అద్భుతాలు చేస్తే మరోసారి పేలవంగా ఆడుతోంది. మొన్నే ధనాధన్‌ ఇన్నింగ్సులతో మురిపించింది. నేటి ముంబయి పోరులో తేలిపోయింది. ఆఖరి లీగు మ్యాచులో ప్రత్యర్థికి 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించింది. రిచా ఘోష్‌ (29; 13 బంతుల్లో 3x4, 2x6) ఒక్కరే మెరుపు షాట్లతో ఆకట్టుకుంది. ఎలిస్‌ పెర్రీ (29; 38 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించింది. అమెలియా కెర్‌ (3) బౌలింగ్‌తో అదరగొట్టింది, నాట్‌ సివర్‌, ఇస్సీ వాంగ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.




రిచా లేకుంటే!


టాస్‌ ఓడిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. భీకరమైన బ్యాటర్‌ సోఫీ డివైన్‌ (0) ఒక పరుగు వద్దే రనౌటైంది. స్మృతి మంధాన (24; 25 బంతుల్లో 3x4, 1x6), ఎలిస్‌ పెర్రీ (29) నిలకడగా ఆడారు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించారు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరును 32/1కి చేర్చారు. రెండో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని అమెలియా కెర్‌ విడదీసింది. 6.4వ బంతికి స్మృతిని ఔట్‌ చేసింది.




వెంటవెంటనే వికెట్లు!


ఆ తర్వాత ముంబయి పట్టు బిగించింది. అస్సలు రన్స్‌ లీక్‌ చేయలేదు. ప్రమాదకర హీథర్‌ నైట్‌ (12)నూ కెర్‌ ఔట్‌ చేసింది. కనిక అహుజా (12) విఫలమైంది. దూకుడు పెంచే క్రమంలో పెర్రీని నాట్‌ సివర్‌ ఎల్బీ చేసింది. దాంతో 16.6 ఓవర్లకు ఆర్సీబీ 100 పరుగుల మైలురాయిని టచ్‌ చేసింది. ఆఖర్లో రిచా ఘోష్‌ మెరుపు బౌండరీలు, సిక్సర్లు బాది స్కోరు బోర్డును ఉరకలెత్తించింది. ఇస్సీ వాంగ్‌ వేసిన 19.1వ బంతిని భారీ సిక్సర్‌ బాదబోయి ఆమె ఔటవ్వడంతో ఆర్సీబీ 125/9కి పరిమితమైంది.