World Test Championship: 2023 - 25కి సంబంధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో భారత్ ఉన్నప్పటికీ ఫైనల్‌కు చేరుతుందో లేదోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 


ఆసీస్‌పై పట్టు సాధిస్తేనే..


నిజానికి న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ వరకు భారత్‌కు ఫైనల్ చేరిక నల్లేరుపై నడకలానే సాగింది. సొంతగడ్డపై కివీస్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో 0-3తో వైట్ వాష్ అయ్యాక తుదిపోరు అవకాశాలు క్లిష్టమయ్యాయి. ఫైనల్‌కి అర్హత సాధించాలంటే కనీసం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో కనీసం 4-0తో భారత్ విజయం సాధించాల్సి ఉంది. అయితే పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం.


ఆసీస్, సౌతాఫ్రికాలకు ఛాన్స్..


ఇక ఫైనల్‌కి చేరుకునే అవకాశం భారత్‌తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాకు ఉన్నాయి. భారత్‌తో పాటు శ్రీలంకతో కలిపి మరో 6 టెస్టులు ఆడాల్సిన ఆసీస్.. అందులో కనీసం 4 టెస్టులైనా విజయం సాధించాలి. ఆ తర్వాత ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాలి. ఇప్పటికే పెర్త్ లో భారత్ చేతిలో ఓడి ఉండటం, బ్యాటర్లు ఫామ్ కోల్పోయిన క్రమంలో టీమిండియాతో మిగతా 4 టెస్టుల్లో గెలవాలంటే ఆసీస్ చెమటోడ్చాల్సిందే. ఇక లంకతో దాని సొంతగడ్డపై 2 టెస్టుల సీరీస్ గెలవడం కంగారూలకు ఆషామాషీ కాదు. దీని కోసం కూడా చాలా కష్టపడాల్సిందే. 


రంగంలోకి సౌతాఫ్రికా..


ఇక డర్బన్‌లో లంకతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించిన ప్రొటీస్.. లంక, పాకిస్తాన్‌లతో జరిగే మిగతా 3 టెస్టుల్లో విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ బెర్తు దక్కించుకుంటుంది. ఈ మూడు మ్యాచ్‌లు సొంతగడ్డపై ఆడనుండటం సఫారీలకు సానుకూలాంశం. ప్రస్తుతం 59.26తో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఇక సఫారీల చేతిలో ఓడిపోయిన లంకకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయినట్లే. ఇక ఇంగ్లాండ్ చేతిలో ఓడిన కివీస్ చేతిలో రెండు టెస్టులున్నాయి. ఇంగ్లీష్ టీమ్‌తో సొంతగడ్డపై జరిగే మిగతా 2 టెస్టుల్లో విజయం సాధించినా.. న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరడం కష్ట సాధ్యమే.


రెండుసార్లు ఓడిపోయిన భారత్..


మరోవైపు డబ్ల్యూటీసీలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గత రెండు సీజన్లలోనూ అదిరే ఆటతో ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. మరే జట్టు రెండుసార్లు ఫైనల్‌కి చేరకపోవడం గమనార్హం. అయితే 2021లో న్యూజిలాండ్ చేతిలో, 2023లో ఆస్ట్రేలియా చేతిలో భారత్.. తుదిపోరులో ఓడిపోయింది. అయితే ఈసారి మాత్రం ముందుగా ఫైనల్‌కు చేరుకుని, ఆ తర్వాత ట్రోఫీని దక్కించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ సీజన్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపుగా అగ్రస్థానంలో తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఓవరాల్‌గా ఆరు సిరీస్‌ల్లో భాగంగా 15 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన.. అందులో తొమ్మిందిటిలో విజయం సాధించి, ఐదింటిలో ఓడిపోయింది. మొత్తం 110 పాయింట్లతో 61.11 విజయాల శాతంతో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. మొత్తం మీద సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ల విజయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతోంది.