ODI World Cup 2023 final Views Record: భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్ వీక్షణల్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే గత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. తాజాగా వన్డే ప్రపంచకప్ 2023కు మరో ఘనత దక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 19న జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్షా 20 వేల మంది అభిమానులు వీక్షించారు. అంతేకాకుండా టీవీల్లో లైవ్‌లో దాదాపు 30 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు BCCI కార్యదర్శి జైషా వెల్లడించారు. భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన కార్యక్రమంగా ఈ మ్యాచ్ నిలిచిందని తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 5.9 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రత్యక్షం ప్రసారం ద్వారా వీక్షించారు.
వరల్డ్‌కప్ ఫైనల్(World Cup) మ్యాచ్‌ని డిస్నీ హాట్‌స్టార్( Disney +Hotstar) OTT వేదికలో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 5 కోట్ల 90 లక్షల మంది వీక్షించారని ఆ సంస్థ తెలిపింది. ఇంతకంటే ముందు 5 కోట్ల 30 లక్షల వీక్షణలతో ఇండియా - న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ అత్యధిక వ్యువర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఏకకాలంలో 5 కోట్ల 90 లక్షల మంది ఫైనల్ మ్యాచ్ వీక్షించినట్లు డిస్నీహాట్‌స్టార్ ఇంఛార్జ్ సజిత్ శివానందన్ తెలిపారు. భారత క్రికెట్ అభిమానుల తిరుగులేని మద్దతుతో అత్యున్నత శిఖరాలకు లైవ్ స్ట్రీమింగ్ చేరిందన్నారు. డిస్నీ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం చేసిన ఫైనల్ మ్యాచ్ గురించి పూర్తి వ్యూవర్‌షిప్ సమాచారాన్ని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసర్చ్ కౌన్సిల్-బార్క్ మరో వారంలో వెల్లడించనున్నట్లు సజిత్ శివానందన్ తెలిపారు.
ఇప్పటివరకూ ఏ దేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీకి దక్కని రికార్డు భారత్ వేదికగా జరిగిన ఎడిషన్‌కు దక్కింది. ఈసారి వన్డే ప్రపంచకప్‌లో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసిన వీక్షకుల సంఖ్య 12 లక్షలు దాటింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC ఈవెంట్ చరిత్రలో ఇలా 12 లక్షల మంది కంటే ఎక్కువ అభిమానులు స్టేడియానికి తరలివచ్చి మ్యాచ్‌ను చూడడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌తో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసే వారి సంఖ్య పది లక్షలు దాటింది. 12 లక్షల మందికి పైగా అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను చూడడం వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గలేదని నిరూపిస్తోందని, ప్రపంచ కప్ విలువ ఏంటో తెలియజేస్తోందని ఐసీసీ ఈవెంట్స్ అధిపతి క్రిస్ టెట్లీ చెప్పాడు.
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో కేవలం భారత్ ఆడే మ్యాచ్‌లనే కాకుండా వేరే జట్ల మ్యాచ్‌లను కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షించారు. ప్రపంచకప్‌ను టీవీల్లో వీక్షించే వారి సంఖ్య గత ప్రపంచకప్‌తో పోలిస్తే 43 శాతం వృద్ధి చెందిందని గతంలో జై షా ట్వీట్ చేశారు. టీవీ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా భారీగా పెరిగిందని వెల్లడించారు. 2019లో ప్రపంచకప్‌తో పోలిస్తే వీక్షణ నిమిషాల్లో 43 శాతం వృద్ధి ఉందని జై షా తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని, వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదో కొత్త రికార్డు అని వివరించారు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌ను వీక్షించే వారి సంఖ్య 43 శాతం పెరిగిందని పేర్కొన్నారు.