ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో శ్రీలంక  సత్తా చాటింది. పసికూన నెదర్లాండ్స్‌పై విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన నెదర్లాండ్స్ అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డచ్‌ జట్టు 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం లక్ష్య చేధనలో లంక జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది. 48.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. సధీర సమరవిక్రమ అద్భుత ఇన్నింగ్స్‌తో లంకకు అద్భుత విజయాన్ని అందించాడు. కానీ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టు చివరి వరకు పోరాడింది.



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో డచ్‌ జట్టు ఆచితూచి ఆడింది. ఏడు పరుగులకే తొలి వికెట్‌ తీసిన రజిత లంకకు మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు. 13 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన భారత సంతతి ఆటగాడు విక్రమ్ జిత్‌ను రజిత వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం  మాక్స్ ఓ'డౌడ్, కోలిన్ అకెర్‌మాన్ నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. లంక బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్న ఈ ఇద్దరు ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించారు. కానీ ఈ జోడిని మరోసారి రజిత విడదీశాడు. 16 పరుగులు చేసిన ఓ'డౌడ్‌ను బౌల్డ్‌ చేశాడు. తర్వాత అకెర్‌మాన్‌, బాస్ డి లీడ్, తేజ నిడమనూరు, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ వెంటవెంటనే వెనుదిరగడంతో 71 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఇక నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ త్వరగానే ముగుస్తుందని అనిపించింది. కానీ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్ అద్భుత భాగస్వామ్యంతో నెదర్లాండ్స్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ పరుగులు అందించారు.



 లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 82 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 70 పరుగులు చేశాడు. లోగాన్ వాన్ బీక్ 75 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్ సాయంతో 59 పరుగులు చేశాడు. కానీ వీరిద్దరూ అవుటైన తర్వాత నెదర్లాండ్స్‌ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయి 49.4 ఓవర్లలో 262 పరుగులకే పరిమితమైంది. 263పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్‌ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద 5 పరుగులు చేసిన కుశాల్‌ పెరీరాను ఆర్యన్‌ దత్త్ అవుట్‌ చేశాడు. 



కానీ మరో ఓపెనర్‌ నిస్సంక లంక స్కోరు బోర్డును ముందు నడిపించాడు. కుశాల్‌ మెండిస్‌తో కలిసి 9 ఓవర్లకు జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కానీ లంక స్కోరు బోర్డు 50 పరుగులు దాటగానే 11 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌ను ఆర్యన్‌ దత్త్‌ అవుటయ్యాడు. కానీ నిస్సంకతో జత కలిసిన సధీర సమరవిక్రమ లంకకు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. నిస్సంక 52 బంతుల్లో 9 ఫోర్లతో 54 పరుగులు చేసి మీక్రెన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 104 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడ్డట్లే కనిపించింది. కానీ సధీర సమరవిక్రమ అజేయ 91 పరుగులతో లంకను విజయతీరాలకు చేర్చాడు.



107 బంతుల్లో 7 ఫోర్లతో 91 పరుగులు చేసిన సమరవిక్రమ నాటౌట్‌గా నిలిచాడు. సమర విక్రమకు చరిత్‌ అసలంక 44 పరుగులు, ధనుంజయ డిసిల్వా 30 పరుగులతో మంచి సహకారం అందించారు. వీరి అండతో లంక లక్ష్యాన్ని చేరుకుంది. చరిత్‌ అసలంక, ధనుంజయ డిసిల్వా అవుటైనా సమరవిక్రమ చివరి వరకూ అజేయంగా నిలిచాడు. సమర విక్రమ పోరాటంతో మరో ఎనిమిది బంతులు మిగిలు ఉండగానే లంక విజయం సాధించింది.