ICC Cricket World Cup 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో క్రమంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఏ జట్లు సెమీస్‌కు చేరుతాయనే లెక్కలు ఊపందుకున్నాయి. కొన్ని జట్లు సెమీస్‌ రేసులో ముందుకు దూసుకుపోతుండగా... మరికొన్ని జట్లు వెనకపడ్డాయి. ప్రపంచకప్‌ ఆరంభంలోనే సెమీస్‌ బెర్తుల విషయమై వేడి రాజుకుంది. చివరికి ఎవరు ఆ నాలుగు బెర్తులను దక్కించుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. రేసులో ముందున్న జట్లకు కూడా ఎదురుదెబ్బలు తగిలితే మళ్లీ సెమీస్‌ రేసు సంక్లిష్టంగా మారనుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ సెమీస్‌ దిశగా దూసుకుపోతున్నాయి. మరోవైపు అంచనాలను తలకిందులు చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌, అయిదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, దాయాది పాకిస్థాన్‌ సెమీస్‌ పోరులో కాస్త  వెనకపడ్డాయి. 

 

ఆ మూడు జట్లేనా..?

ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు మూడు మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ మ్యాచుల్లో ఊహించని ఫలితాలతో కొన్ని జట్లు వెనకపడ్డాయి. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచులు గెలిచి ఊపు మీదున్న టీమిండియా, న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. రెండు మ్యాచుల్లో గెలిచిన దక్షిణాఫ్రికాకు ఆశలు ఉన్నాయి. ఈజట్లు మిగిలిన మ్యాచుల్లోనూ ఇలాగే రాణిస్తే సెమీస్‌ చేరడం కష్టం కాకపోవచ్చు. కానీ సెమీస్‌ చేరే ఆ మిగిలిన జట్టు ఏదా అన్న ప్రశ్న ఎదురవుతుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరితే నాలుగో స్థానం కోసం పోటీ తీవ్రమవుతుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, నాలుగో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌, అయిదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ మధ్య పోరు తీవ్రంగా ఉండొచ్చు. మిగిలిన జట్లకు అవకాశం ఉంది. 

 

టీమిండియాకు సులభమే..

పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. భారత జట్టు ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే సెమీఫైనల్‌కు వెళ్లే మార్గం సులభమవుతుంది. కానీ భారత జట్టు కీలక మ్యాచ్‌లను ఆడనుంది. భీకర ఫామ్‌లో ఉన్న జట్లతో మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పెద్ద కష్టం కాదు. ప్రమాదకరమైన ఫామ్‌లో ఉన్న మూడు జట్లతో భారత్ పోటీపడుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో టీమిండియా అక్టోబర్ 22న మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. దీని తర్వాత అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో తలపడనుంది. నవంబర్ 5న సౌతాఫ్రికాతో మ్యాచ్ జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు భారత్‌కు చాలా కీలకం. ఇందులో టీమిండియా గెలిస్తే సెమీస్‌ చేరిక లాంఛనమే అవుతుంది. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. సెమీఫైనల్‌కు భారత్‌తో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కూడా పోటీ పడుతున్నాయి. 

 

ఆ ఒక్క జట్టేది..?

సెమీస్‌ రేసులో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా దూసుకెళ్తున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేయడంతో భారత్‌ ఒక్కసారిగా టైటిల్‌కు హాట్‌ ఫేవరెట్‌గా మారింది. టీమ్‌ఇండియా సెమీస్‌ చేరడం లాంఛనమే కావచ్చు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను అలవోకగా ఓడించడంతో న్యూజిలాండ్‌ కూడా సెమీస్‌కు ఫేవరెట్‌ అయింది. ఇంకో పెద్ద జట్టును ఓడిస్తే కివీస్‌కు మార్గం మరింత సుగమమవుతుంది. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సఫారీ జట్టు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొంది. అంతకంటే ముందు లంకను ఆ జట్టు మట్టికరిపించింది. సఫారీ జట్టు జోరు చూస్తుంటే సెమీస్‌ బెర్తును వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలతో ఈ ప్రపంచకప్‌ ఆరంభ దశలోనే ఆసక్తికరంగా మారింది.