భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు డైరెక్టర్ మిక్కీ అర్థర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. దాయాదుల పోరు ముగిసిన తర్వాత ఇది ప్రపంచకప్‌లా లేదు బీసీసీఐ ఈవెంట్‌లా ఉందని అర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ జట్టు మాజీ క్రికెటర్లు, భారత క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. అర్థర్‌ వ్యాఖ్యలు కలకలం రేపుతున్న వేళ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ICC స్పందించింది. ఆర్థర్‌ వ్యాఖ్యాలను చాలా తేలిగ్గా తీసుకుంది. తాము నిర్వహించే ప్రతి టోర్నమెంట్‌లో ఇలాంటి విమర్శలు సహజమేనని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. వివిధ వర్గాల నుంచి ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయని ICC ఛైర్మన్‌ అన్నారు. విమర్శలు వచ్చినప్పుడు మనం వాటిని మర్చిపోయి ముందుకు సాగాలని  బార్ల్కే అన్నారు. తాము టోర్నమెంట్‌లను ఇంకా మెరుగ్గా నిర్వహించడానికి ప్రయత్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. భారత్‌ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌ అత్యుత్తమైనది అవుతుందనే సంతృప్తి తనకు ఉందని వెల్లడించారు. మేం ప్రతీ టోర్నీ ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహిస్తామని, ఏం మార్చవచ్చు, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచిస్తామని ICC ఛైర్మన్‌ తెలిపారు. 



 భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడిన తర్వాత  పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్‌ ఏడ్చినంత పని చేశాడు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఐసీసీ ఈవెంట్‌లా అనిపించ లేదని... బీసీసీఐ కార్యక్రమంలా ఉందని వ్యాఖ్యానించాడు. తమకు ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడినట్లు ఉందని, మ్యాచ్‌ సందర్భంగా ఒక్కసారి కూడా పాకిస్థాన్‌ జట్టుకు అనుకూలంగా మద్దతు లభించలేదని అర్థర్‌ మ్యాచ్‌ ఆనంతరం వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ కోసం భారతదేశానికి వెళ్లడానికి పాకిస్తాన్ అభిమానులకు వీసాలు మంజూరు కాలేదని కూడా ఆర్థర్‌ ఆరోపించాడు. పాకిస్థాన్ కోచ్ గ్రాండ్ బ్రాడ్‌బర్న్ కూడా పరిస్థితులు భారత్ వైపే ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తమ మద్దతుదారులు లేనందుకు మేము నిజంగా విచారిస్తున్నామని వ్యాఖ్యానించాడు. 



 భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ద్వైపాక్షిక సిరీస్‌లా ఉందన్న పాక్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌పై వ్యాఖ్యలపై పాక్‌ మాజీ కెప్టెన్‌, దిగ్గజ పేసర్ వసీమ్‌ అక్రమ్ మండిపడ్డాడు. మిక్కీ అస్సలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు ఇచ్చాడో తనకు అర్థం కావడం లేదని వసీం ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుల్‌దీప్‌ సహా టీమిండియా బౌలర్లను ఎదుర్కోనేందుకు అసలు మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని అని నిలదీశాడు. మీక్కి అర్థర్‌ ఆ విషయం చెప్తే వినాలని ఉందని వసీం అక్రమ్‌ ఎద్దేవా చేశాడు. పాకిస్థాన్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ కూడా మిక్కీ అర్థర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ను విమర్శించే బదులు, వారిని ప్రశంసించాలని మాలిక్‌ అన్నాడు. బీసీసీఐను మెచ్చుకోవాలని, మనంకు కూడా ఇలాంటి పరిస్థితులను సృష్టించాలని మాలిక్ అన్నాడు. మరో పాక్‌ మాజీ ఆటగాడు మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కూడా అర్థర్‌పై మండిపడ్డాడు. పాక్‌ మిక్కీ అర్థర్‌ పాక్ ఓటమిని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాడని మండిపడ్డాడు. భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం వల్ల సానుభూతి పొందాలని చూస్తున్నట్లుందని మొయిన్‌ ఖాన్‌ అన్నాడు.