స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉన్న టీమిండియా ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తూ నిరాటంకంగా ముందుకు సాగుతోంది. అద్భుత సారథ్యం.. అదిరిపోయే ఆటతీరుతో కెప్టెన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ విధ్వంస ఆట ఇప్పుడిప్పుడే అభిమానులు మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హిట్టర్ సురేష్ రైనా రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను రైనా ప్రశంసలతో ముంచెత్తాడు. రోహిత్‌కు ఎం.ఎస్. ధోనీతో సమానమైన గౌరవం ఉందని వెల్లడించాడు.
తాను ఆటగాళ్లతో మాట్లాడినప్పుడల్లా రోహిత్‌కు ధోనీతో సమానమైన గౌరవం ఉందని వారు చెబుతారని సురేష్ రైనా తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ చాలా స్నేహపూర్వకంగా ఉంటాడని, టీమిండియా తదుపరి ఎంఎస్ ధోని రోహిత్ శర్మనే అని సురేష్ రైనా కొనియాడాడు. భారత క్రికెట్ జట్టుకు రోహిత్ రెండో ధోని అని అన్నాడు. ధోనిని తాను చాలా దగ్గర నుంచి చూశానని... అతను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని, సహచర ఆటగాళ్లు చెప్పింది శ్రద్ధగా వింటాడని రైనా గుర్తు చేసుకున్నాడు. ఆటగాళ్లకు తమపై తమకు నమ్మకం కల్పించేందుకు ధోని ప్రయత్నిస్తాడని, అతను ముందుండి జట్టును నడిపిస్తాడని అన్నాడు. ఈ లక్షణాలన్నీ రోహిత్‌లోనూ ఉన్నాయని రైనా గుర్తు చేశాడు. కెప్టెన్ ముందుండి జట్టును నడిపించినప్పుడు .. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణాన్ని గౌరవించినప్పుడు ఆటగాళ్లకు మరింత మార్గదర్శకంగా ఉంటారని రైనా అన్నాడు. ఈ విషయాల్లో ధోనీ, రోహిత్ ఒక్కటే అని వెల్లడించాడు.
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ సాధించాడు. ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడగా ఆ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 పరుగులతో రోహిత్ విధ్వంసం సృష్టించాడు. పాకిస్తాన్‌పై దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 86 పరుగులు చేశాడు. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో టీమిండియా నాలుగో మ్యాచ్ ఆడనుంది.
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ అరుదైన రికార్డుల అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్‌కు.. రోహిత్ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం. అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ప్రస్తుతం రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరూ కనపపడం లేదు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు.
స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గానూ రోహిత్ శర్మ ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. హిట్‌మ్యాన్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) సిక్సులతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా రోహిత్ శర్మ అవతరించాడు. ప్రపంచకప్‌లో కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసి వార్నర్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.