IND vs PAK:
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరువు కోసం పాకులాడుతోంది! బీసీసీఐ చేతిలో భంగపాటుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనడంపై కొర్రీలు పెడుతోంది. ఒకవేళ వచ్చినా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆడబోమంటూ బెదిరింపులకు దిగుతోంది! దీంతో మెగా టోర్నీ షెడ్యూలు, వేదికల కేటాయింపులపై ఐసీసీ తర్జనభర్జన పడుతోంది.
అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది. బీసీసీఐ (BCCI) ఆతిథ్య హక్కులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ముందే ఆసియాకప్ (Asia Cup 2023) నిర్వహణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. భారత ప్రభుత్వ అంగీకారం లేకపోవడంతో టీమ్‌ఇండియా.. పాక్‌లో అడుగు పెట్టదని బీసీసీఐ కార్యదర్శి జే షా గతంలోనే స్పష్టం చేశాడు. తటస్థ వేదికలోనే ఆడతామని చెప్పారు. అప్పుడు పాకిస్థాన్ ఇందుకు అంగీకరించలేదు.
టీమ్‌ఇండియా కచ్చితంగా పాక్‌లో ఆసియాకప్ ఆడితేనే తాము భారత్‌లో వన్డే ప్రపంచకప్ ఆడతామని పీసీబీ బెదిరించింది. దాంతో భారత్ ఆడే మ్యాచుల్ని శ్రీలంకలో నిర్వహించేందుకు పీసీబీ మొగ్గు చూపింది. తటస్థ వేదికలు ఏర్పాటు చేస్తామన్నట్టు చెప్పింది. రీసెంట్‌గా ఆసియాకప్ సమావేశంలో సీన్ రివర్స్ అయింది. పీసీబీ ఆతిథ్యాన్ని బీసీసీఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు వ్యతిరేకించాయి. అక్కడ ఆడలేమని స్పష్టం చేశాయి. దాంతో ఆసియాకప్ వేదిక శ్రీలంకకు మారింది.
బీసీసీఐ చేతిలో జరిగిన భంగపాటును పీసీబీ తట్టుకోలేకపోతోంది. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ఆడబోం అన్నట్టుగా బెదిరింపులకు దిగుతోంది. ఒకవేళ ఆసియాకప్ ఆడినా వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ససేమిరా అంటోంది. లక్ష మంది వీక్షించే మోతేరా స్టేడియంలో మాత్రం టీమ్ఇండియాతో ఆడమని కొర్రీలు పెడుతోంది. బెంగళూరు, చెన్నైలో పాకిస్థాన్ మ్యాచుల్ని ఎక్కువగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. వీటికీ పీసీబీ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా పశ్చిమ్ బంగాల్‌లో ఈడెన్ గార్డెన్‌ను ఎంపిక చేయొచ్చని సమాచారం.
'కొన్ని కారణాల వల్ల నరేంద్రమోదీ స్టేడియంలో ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించకపోవచ్చు' అని పీసీబీ వర్గాలు పాకిస్థాన్‌లోని జియోటీవీకి సమాచారం అందించాయి. నరేంద్రమోదీ స్టేడియంలో దాదాపుగా లక్షా పదివేల మంది ప్రత్యక్షంగా మ్యాచుల్ని వీక్షించొచ్చు. భారత్xపాకిస్థాన్, ఆసీస్xఇంగ్లాండ్, సెమీస్, ఫైనల్ వంటి కీలక మ్యాచుల్ని అక్కడే నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.