World Cup 2023 Qualifier: ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆ మేరకు సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సంచలన విజయాలతో దూసుకెళ్తున్నది. క్వాలిఫై రౌండ్‌లోని గ్రూప్ - ఎ లీగ్ పోటీలలో భాగంగా యూఎస్ఎతో నేడు (సోమవారం) ముగిసిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 50 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 408 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం యూనైటెడ్ స్టేట్స్‌ను 25.1 ఓవర్లలో 104 పరుగులకే చిత్తుచేసి 304 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది.
కెప్టెన్ దంచెన్..
హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యూఎస్ఎ ఆహ్వానం మేరకు జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. జింబాబ్వే జట్టు సారథి సీన్ విలియమ్స్ (101 బంతుల్లో 174, 21 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లలో అతడికి ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. అంతగా అనుభవం లేని యూఎస్ బౌలింగ్‌ను విలియమ్స్ ఆటాడుకున్నాడు. అతడికి తోడుగా ఓపెనర్ గుంబీ (103 బంతుల్లో 78, 5 ఫోర్లు), ఆల్ రౌండర్ సికందర్ రజా (27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో జింబాబ్వే భారీ స్కోరు చేసింది. వన్డేలలో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు 2009లో కెన్యా మీద 351-7 పరుగులు చేసింది.
యూఎస్ తుస్..
భారీ లక్ష్య ఛేదనలో యూనైటెడ్ స్టేట్స్.. జింబాబ్వేకు నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆ జట్టులో తొలి నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అభిషేక్ పరడ్కర్ (31 బంతుల్లో 24, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. జస్దీప్ సింగ్ (21), గజానంద్ సింగ్ (13) లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలినవారి స్కోరు వివరాలు.. 0, 6, 9, 8, 0, 2, 6, 0 గా నమోదయ్యాయి. జింబాబ్వే బౌలర్లు కలిసికట్టుగా రాణించి యూఎస్ టీమ్‌ను కోలుకోనీయకుండా చేశారు.
పరుగులపరంగా రికార్డు..
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేలలో ఇది పరుగులపరంగా రెండో అతిపెద్ద విజయం కావడం విశేషం. 2023 లో భారత్ - శ్రీలంక మధ్య తిరువనంతపురం మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా.. లంకపై 317 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. టీమిండియా తర్వాత జింబాబ్వే రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ (290 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై), ఆస్ట్రేలియా (275 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై) ఉన్నాయి.
సూపర్ సిక్సెస్‌కు అర్హత..
లీగ్ దశ మ్యాచ్‌లు రేపటి (జూన్ 27)తో ముగుస్తాయి. రెండు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్న ఈ లీగ్‌లో గ్రూప్ - ఎ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్‌లు అర్హత సాధించగా గ్రూప్ - బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్ లు క్వాలిఫై అయ్యాయి. ఐర్లాండ్, యూఏఈ, నేపాల్, యూఎస్‌లు లీగ్ దశలోనే ఎలిమినేట్ అయ్యాయి. ఇక సూపర్ సిక్సెస్‌లో ఆరు జట్లు.. తమ ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. చివరికి పాయింట్లపట్టికలో టాప్ - 2 గా నిలిచిన జట్లు అక్టోబర్‌లో ఇదివరకే వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించిన 8 జట్లతో కలుస్తాయి.