Sarfaraz Khan: 


యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది! వెస్టిండీస్‌ సిరీసుకు ఎంపిక చేయకపోవడానికి అతడి సెలబ్రేషన్స్‌ తీరు సెలక్టర్లకు నచ్చకపోవడమే కారణమన్న దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు.  సర్ఫరాజ్‌పై సెలక్టర్లకు ఎలాంటి వివక్ష లేదని ఒక వర్గం చెబుతుండగా.. అతడు సెలక్టర్లను అగౌరవపర్చలేదని ఇటువైపు చెబుతున్నారు. ఇంకా ఫిట్‌నెస్‌పై చర్చిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది.


వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీసుకు శివసుందర్‌ దాస్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌ను (Sarfaraz Khan) ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయం విమర్శలకు దారితీసింది. అతడిని ఎంపిక చేయనప్పుడు రంజీ ట్రోఫీలకు ఉన్న విలువేంటో వివరించాలని గావస్కర్‌ అన్నాడు. మూడు సీజన్లుగా అతడు టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడని గుర్తు చేశాడు. అయితే అతడిని మళ్లీ మళ్లీ పట్టించుకోకపోవడానికి క్రికెట్‌ ఏతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అతడి ఫిట్‌నెస్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు లేదని బరువు తగ్గించుకొని మరింత ఫిట్‌గా మారాలని పేర్కొన్నాయి. వీటిని సర్ఫరాజ్‌ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.


గత రంజీ సీజన్లో దిల్లీపై సెంచరీ తర్వాత సర్ఫరాజ్‌ ఖాన్‌ సంబరాల తీరు ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. అతడు డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు తిరిగి ఎగురుతూ, తొడగొట్టాడు. అయితే ఆ మ్యాచుకు హాజరైన సెలెక్టర్లను ఉద్దేశించే అలా చేశాడని అప్పటి చీఫ్‌ సెలక్టర్ చేతన్ శర్మకు ఇది నచ్చలేదని సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపించాయి. అతడి ప్రవర్తన నచ్చకనే ఎంపిక చేయడం లేదని వైరల్‌ చేస్తున్నారు. 


'దిల్లీపై సెంచరీ తర్వాత సర్ఫరాజ్‌ సంబరాలు అతడి జట్టు సహచరులను ఉద్దేశించే చేశాడు. కోచ్‌ అమోల్‌ మజుందార్‌ సైతం హ్యాట్సాఫ్ చెప్పాడు. ఆ మ్యాచును సెలక్షన్‌ కమిటీ నుంచి వీక్షించింది సలిల్‌ అంకోలా. అప్పడక్కడికి చేతన్‌ శర్మ రానే లేదు. ఒత్తిడి నుంచి తన జట్టును రక్షించినందుకు సర్ఫరాజ్‌ అలాంటి వేడుకలు చేసుకున్నాడు' అని యువ క్రికెటర్‌ సన్నిహితులు మీడియాకు చెప్పారు. 'తన సొంత డ్రస్సింగ్‌ రూమ్‌ వైపు చూస్తే చేసుకున్న సంబరాలకు ఇలాంటి పెడార్థాలు తీయడం సరికాదు' అని వారు వివరించారు.


సర్ఫరాజ్‌ సంబరాల తీరు, అతడి ప్రవర్తన మధ్యప్రదేశ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌కు నచ్చలేదని మరో వాదన తెరపైకి వచ్చింది. అతడి వ్యవహారశైలితో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని సర్ఫరాజ్‌ సన్నిహిత వర్గాలు కొట్టిపారేశాయి. యువ క్రికెటర్‌పై పండిత్‌ ఎంతగానో ప్రేమ కురిపిస్తారని చెప్తున్నారు. 'సర్ఫరాజ్‌ను చందూసర్‌ సొంత కొడుకులాగా చూసుకుంటారు. అతడి గురించి ఎప్పుడూ మంచిగానే చెప్తారు. 14 ఏళ్ల నుంచి అతడేంటో తెలుసు. ఆయనెప్పుడూ అతడిపై కోప్పడలేదు' అని పేర్కొన్నారు.


వెస్టిండీస్‌ సిరీసుకు ఎంపిక చేయకపోవడానికి ఫిట్‌నెస్‌ సరిపోదన్న వాదనను సర్ఫరాజ్‌ సన్నిహితులు వ్యతిరేకిస్తున్నారు. 'ప్రస్తుతం టీమ్‌ఇండియాకు నిర్దేశించిన ప్రమాణాలకు సర్ఫరాజ్‌ సరిపోతాడు. 16.5 యోయో స్కోర్‌ను బీట్‌ చేస్తున్నాడు. అతడు రెండు రోజులు ఎడతెరపి లేకుండా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మరో రెండు రోజులు ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. మంచి ఫిట్‌నెస్‌ అతడి సొంతం' అని చెప్తున్నారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial