ICC ODI WC 2023: ప్రపంచకప్‌ తుదిపోరులో ఓటమిపాలైన భారత జట్టు(Team India)కు దేశంలోని ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. టోర్నీ ఆసాంతం భారత ఆటగాళ్లు కనబరిచిన ప్రతిభ,అంకితభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ(Pm Narendra Modi) ఇప్పటికే కొనియాడారు. గొప్ప స్ఫూర్తితో ఆడిన మిమ్మల్ని చూసి.. దేశం యావత్తూ గర్విస్తోందని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికీ, ఎప్పటికీ మేము మీకు అండగా ఉంటామని మోదీ పేర్కొన్నారు. అద్భుతంగా ఆడిన భారత ఆటగాళ్లు హృదయాలను గెలుచుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun kharge) కొనియాడారు. మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూనే ఉంటామని ఆటగాళ్లను ఉద్దేశించి... ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గెలిచినా, ఓడినా మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటామని భారత జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టోర్నీలో భారత్‌ జట్టు గొప్పగా ఆడిందన్న రాహుల్‌ తదుపరి ప్రపంచకప్‌ గెలుద్దామని పేర్కొన్నారు. కప్పును కోల్పోయినప్పటికీ టోర్నీ మొత్తం టీమిండియా అసాధారణంగా ఆడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Arvind kejriwal) పేర్కొన్నారు. అద్భుతంగా పోరాడానికి, ఎంతో శ్రమించారని ఢిల్లీ సీఎం ఆటగాళ్లను పొగుడుతూ పోస్ట్ చేశారు.


ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌(Kapil Dev) ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని కపిల్‌ తెలిపాడు. ఛాంపియన్స్‌లా ఆడారని... సగర్వంగా తల ఎత్తుకోండని సూచించారు. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదని... మీరెప్పుడో విజేతలుగా నిలిచారని గుర్తు చేశాడు. మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోందని.... రోహిత్‌.. తన పనిలో మాస్టర్‌ నువ్వుని అన్నాడు భవిష్యత్తులో మరిన్ని విజయాలు రోహిత్‌ కోసం ఎదురు చూస్తున్నాయని కపిల్‌ దేవ్‌ అన్నాడు. ఇది కష్టకాలమని తనకు తెలుసని.... కానీ స్ఫూర్తిని కోల్పోవద్దని... భారత్‌ మీకు మద్దతుగా ఉందన్నాడు.  ఆటగాళ్ల ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌ క్రికెటర్లను  ఓదార్చాడు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత బాధపడుతున్నారో తనకు తెలుసని.... గెలుపు ఓటములన్నవి ఆటలో ఒక భాగమని అన్నాడు. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలని ఈ జట్టు ఈ టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ఆటతీరు కనబర్చిందని సచిన్‌(Sachin) అన్నాడు. 


ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్‌ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్‌ సీమర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని తాను చేసిన ట్వీట్‌లో ఈ స్పీడ్‌ స్టార్‌ పేర్కొన్నాడు.