Womens Ashes 2023: కొద్దిరోజుల క్రితమే  ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య  జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లోని తొలి టెస్టు తాలూకూ జ్ఞాపకాలు మరిచిపోకముందే ఉమెన్స్ యాషెస్‌లో సంచలనం నమోదైంది.  పురుషుల యాషెస్‌తో సమాంతరంగా ఇంగ్లాండ్‌ వేదికగానే జరుగుతున్న మహిళల యాషెస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఐదు రోజుల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో  ఆస్ట్రేలియా ఆట ఆఖరి రోజు 89 పరుగుల తేడాతో  విజయం సొంతం చేసుకుంది. 


నాటింగ్‌హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో  ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఎదుట  268 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే  నాలుగో రోజు మూడో సెషన్ ఆడిన ఇంగ్లాండ్.. ఆట ముగిసే సమయానికి  ఐదు వికెట్ల నష్టానికి  116 పరుగులు చేసింది.   టెస్టు చివరి రోజైన నేడు ఇంగ్లాండ్ విజయానికి  152 పరుగులు అవసరం కాగా ఆసీస్‌కు ఐదు వికెట్లు  అవసరమయ్యాయి.  


గార్డ్‌నర్  స్పిన్ మాయకు ఇంగ్లాండ్ కుదేలు.. 


ఓవర్ నైట్ స్కోరు 116-5  వద్ద ఐదో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ ధాటిగా ఆడేందుకు యత్నించింది.  కానీ నాలుగో రోజు మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాపార్డర్ వెన్ను విరిచిన  ఆసీస్ స్పిన్నర్ ఆష్లే గార్డ్‌నర్..  33వ ఓవర్లో  కేట్ క్రాస్ (13)‌ను ఔట్ చేసింది. ఇదే ఊపులో  ఆమె 37వ ఓవర్లో  అమీ జోన్స్(4)  ను కూడా పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత సోఫీ ఎకిల్‌స్టోన్ (10)న వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. లారెన్ ఫైరల్  (0)ను క్లీన్ బౌల్డ్ చేసిన గార్డ్‌నర్.. తన  టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసిన  డేనియల్  వ్యాట్  (88 బంతుల్లో 54, 5 ఫోర్లు) ను కూడా బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.  


టెస్టులలో బెస్ట్ బౌలింగ్.. 


నిన్న మూడు వికెట్లతో పాటు  సోమవారం ఐదు వికెట్లూ ఆమె ఖాతాలోకి చేరడంతో  రెండో ఇన్నింగ్స్‌లో గార్డ్‌నర్ 8 వికెట్లు పడగొట్టినట్టైంది.  ఒక ఇన్నింగ్స్‌లో ఆమెకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్‌లో కూడా గార్డ్‌నర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.  దీంతో ఈ టెస్టులో ఆమె గణాంకాలు 12/165గా నమోదయ్యాయి.  మహిళల టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్లలో గార్డ్‌నర్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో  పాకిస్తాన్ బౌలర్  షాజియా ఖాన్.. (2004లో  వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 13/226) అగ్రస్థానంలో ఉంది. 


 






ఇంగ్లాండ్ గడ్డపై 8 ఏండ్ల తర్వాత... 


ఉమెన్స్ యాషెస్‌లో ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం ఆస్ట్రేలియాకు  8 ఏండ్ల తర్వాత ఇదే ప్రథమం.  చివరిసారిగా ఆ జట్టు.. 2015లో ఇంగ్లాండ్ పర్యటనకు రాగా  అప్పుడు జరిగిన మ్యాచ్‌లో  ఇంగ్లీష్ టీమ్‌ను ఓడించింది.  ఆ తర్వాత మళ్లీ 2023లో ఆ ఘనతను సొంతం చేసుకుంది. 


సంక్షిప్త స్కోరు వివరాలు : 


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ :  473 ఆలౌట్ 
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 463 ఆలౌట్ 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 257 ఆలౌట్ 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 178 ఆలౌట్ 
ఫలితం : 89 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం