Sachin Test Record: టీమిండియా లెజెండరీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. 17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన మాస్టర్ ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి 100 సెంచరీలు, టెస్టుల్లో అత్యధిక పరుగులు. ఈ రెండు రికార్డులు సచిన్ ఖాతాలో ప్రధానమైనవి. బద్దలు కొట్టడానికి కష్టసాధ్యమైనవి. అయితే వీటిని తిరగరాసేందుకు ఈతరం క్రికెటర్లు దగ్గరగా వస్తున్నారు. టెండూల్కర్ 100 వందలను అందుకోవడానికి కోహ్లీ ఉవ్విళ్లూరుతుంటే.. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ ముందున్నాడు.
సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో మొత్తం 15,921 పరుగులు చేశాడు. 200 టెస్ట్ మ్యాచుల్లో 329 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు సాధించాడు. ఇప్పటికీ టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు మాస్టర్ పేరుమీదే ఉంది. ఈ ఫార్మాట్లో సచిన్ 51 సెంచరీలు బాదాడు. అలాగే ఇప్పటివరకు 200 టెస్టులు ఆడిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పుడు టెండూల్కర్ అత్యధిక టెస్టు రన్స్ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ప్రస్తుతం ప్రపంచక్రికెట్ లో ఒకరికి ఉంది. అతనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్.
సచిన్ కు దగ్గరగా జో రూట్
జో రూట్... గత రెండేళ్లుగా టెస్ట్ క్రికెట్ లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. 2021లో 15 మ్యాచుల్లో 29 ఇన్నింగ్సుల్లో 1708 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే 2022లో 15 మ్యాచుల్లో 27 ఇన్నింగ్సుల్లో 1098 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 7 అర్ధశతకాలు ఉన్నాయి. గత రెండేళ్లలో మొత్తం 2806 పరుగులు చేశాడు రూట్. ప్రస్తుతం అతను టెస్ట్ క్రికెట్ లో 10629 పరుగులతో కొనసాగుతున్నాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి రూట్ కు ఇంకా 5293 పరుగులు కావాలి.
ఈ ఏడాది సాధ్యం కాదు
ప్రపంచంలో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా టెస్ట్ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 2000 పరుగులు కూడా చేయలేదు. 2006లో పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ యూసుఫ్ 1788 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు క్యాలెండర్ ఇయర్ లో ఇదే అత్యధికం. సచిన్ రికార్డును అందుకోవాలంటే రూట్ కు ఇంకా 5293 పరుగులు కావాలి. దీన్నిబట్టి అతను ఈ సంవత్సరం టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టలేడనే చెప్పాలి. సచిన్ రికార్డును అందుకోవాలంటే జో రూట్ కు కనీసం ఇంకో మూడేళ్లయినా పడుతుంది. అది కూడా ఇప్పుడున్న ఫాంను కొనసాగిస్తే. మరి చూద్దాం రూట్ మాస్టర్ బ్లాస్టర్ అందుకుంటాడో లేదో.