Will Jasprit Bumrah play in Asia Cup 2025 | భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆడటం లేదు. కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న సిరీస్‌లోని కీలకమైన చివరి టెస్టులో బుమ్రా లేడు. వాస్తవానికి చివరి టెస్ట్ నుంచి అతడికి బీసీసీఐ (BCCI) విశ్రాంతి ఇచ్చింది. బుమ్రా త్వరలో జరగనున్న ఆసియా కప్‌లో ఆడటం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. 

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 2 మ్యాచ్‌లు ఆడని జస్ప్రిత్ బుమ్రా

ఇంగ్లండ్‌తో నిర్వహిస్తున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కేవలం 3 టెస్టులు మాత్రమే బుమ్రా అందుబాటులో ఉంటాడని సిరీస్ కు ముందే బీసీసీఐ స్పష్టం చేసింది. అందుకు తగ్గట్లుగానే స్టార్ పేసర్ మూడు టెస్టులు మాత్రమే ఆడాడు, రెండు టెస్టులకు అందుబాటులో లేడు.  శుక్రవారం ప్రారంభమైన చివరి టెస్టు జట్టు నుంచి బుమ్రాను రిలీజ్ చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు కూడా బుమ్రా రాలేదు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఈ టెస్టు ఆడటం లేదు. కానీ బుమ్రాలా కాకుండా స్టోక్స్ తన జట్టుతోనే ఉన్నాడు. ఆల్ రౌండర్ ప్రాక్టీస్ సెషన్‌లకు హాజరయ్యాడు. కానీ జస్ప్రీత్ బుమ్రా ఆ పని చేయలేదు.

ఆసియా కప్ నుండి బుమ్రా ఔట్ !

వర్క్‌లోడ్ కింద జస్ప్రిత్ బుమ్రా ఆసియా కప్ నుంచి సైతం దూరంగా ఉండే అవకాశం ఉంది. 2025 ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఆ వెంటనే అక్టోబర్ 2 నుండి వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. దాంతో బుమ్రాపై ఓవర్ లోడ్ ఉండకూడదని, టెస్ట్ సిరీస్ కోసం పేసర్ కావాలనుకుంటే ఆసియా కప్ నుంచి తనకు విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.  

"ఇది కష్టమైన నిర్ణయం అని చెప్పవచ్చు. బుమ్రాకు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కూడా మనకు చాలా ముఖ్యం. టీ20 విషయానికొస్తే జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. ఇది టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత్‌కు కీలకమైన సిరీస్ కానున్నాయి" అని న్యూస్ ఏజెన్సీ పీటీఐ వర్గాల సమాచారం అని రాసుకొచ్చింది. గత టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ లేదా 2025 ఆసియా కప్

 BCCI వర్గాలను ఈ నివేదికలో ఉటంకిస్తూ, "ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా 2025 ఆసియా కప్‌ ఆడితే కనుక అహ్మదాబాద్‌లో జరిగే వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం జట్టులో బుమ్రా అవసరం ఉంటుందని అందరికీ తెలుసు. అతను ఆసియా కప్ ఆడితే వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకుంటాడు. విండీస్ సిరీస్ వదులుకోవాలంటే ఆసియా కప్ లో బుమ్రాను చూడవచ్చు" అని పీటీఐ పేర్కొంది.