Yashasvi Jaiswal Super 50: ఇంగ్లాండ్, ఇండియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న ఐదో టెస్టు ర‌సవ‌త్త‌రంగా జ‌రుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను నిలువ‌రించిన భార‌త్.. త‌మ రెండో ఇన్నింగ్స్ ను మెరుగ్గా ప్రారంభించింది. శుక్ర‌వారం రెండోరోజు ఆట‌ముగిసేస‌రికి రెండో ఇన్నింగ్స్ లో భార‌త్ 18 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల‌కు 75 ప‌రుగులు చేసింది. విధ్వంస‌క ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ ఫిఫ్టీ (49 బంతుల్లో 51 బ్యాటింగ్, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సూప‌ర్ ట‌చ్ లో క‌నిపించాడు. క్రీజులో అత‌నితోపాటు నైట్ వాచ్ మ‌న్ ఆకాశ్ దీప్ (4 బ్యాటింగ్) ఉన్నాడు. ఓవరాల్ గా ఇండియా ఆధిక్యం 52 ప‌రుగుల‌కు చేరుకుంది. ఓపెనర్ కేెఎల్ రాహుల్ (7), సాయి సుదర్శన్ (11) విఫలమయ్యారు. జోష్ టంగ్, గ‌స్ అట్కిన్స‌న్ చెరో వికెట్ తీశారు. శ‌నివారం మొత్తం బ్యాటింగ్ చేసి, వీలైనంత ఎక్కువ‌గా టార్గెట్ ను ఇంగ్లాండ్ కు విధించాల‌ని టీమిండియా భావిస్తోంది. అంత‌కుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 247 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, ఇండియా 224 ప‌రుగులు చేసింది. ఐదు టెస్టుల అండ‌ర్స‌న్- టెండూల్క‌ర్ ట్రోఫీలో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. 

రెండో రోజు 16 వికెట్లు..పేసర్లకు స్వర్గధామమైన ఈ వికెట్ పై బౌల‌ర్లు శుక్ర‌వారం పండుగ చేసుకున్నారు. రెండో రోజు ఏకంగా 16 వికెట్లు నేల‌కూల‌డం విశేషం. అంత‌కుముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 204/6 తో తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన ఇండియా.. మ‌రో 20 జోడించి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. క‌రుణ్ నాయ‌ర్ త‌న అర్ద సెంచ‌రీకి మ‌రో ఐదు ప‌రుగులు జోడించి ఔట‌వ‌గా, గ‌స్ అట్కిన్స‌న్ భార‌త లోయ‌ర్ ఆర్డ‌ర్ ను క‌కావిక‌లం చేశాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (26)ల‌తోపాటు మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్ర‌సిధ్ కృష్ణ‌ను ఔట్ చేసి, ఫైఫ‌ర్ పూర్తి చేసుకున్నాడు. దీంతో భార‌త ఇన్నింగ్స్ 224 ప‌రుగుల వ‌ద్ద ముగిసింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో జోష్ టంగ్ కు ఒక వికెట్ ద‌క్కింది. 

సూప‌ర్ భాగ‌స్వామ్యం..తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ అదిరే ఆరంభం ద‌క్కింది. ఓపెన‌ర్లు జాక్ క్రాలీ (64), బెన్ డ‌కెట్ (43) జ‌ట్టుకు శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు వేగ‌వంతంగా ఆడి 77 బంతుల్లోనే 92 ప‌రుగులు జోడించారు. అయితే డ‌కెట్ వికెట్ తీసిన ఆకాశ్ దీప్ బ్రేక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ప్ర‌సిధ్ నాలుగు, సిరాజ్ మూడు వికెట్ల‌తో చెల‌రేగి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన‌ప్ ను దెబ్బ తీశారు. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ హేరీ బ్రూక్ అద్భుత‌మైన ఫిఫ్టీ (53)తో చెల‌రేగ‌డంతో ఇంగ్లాండ్ కు 23 ప‌రుగుల ఆధిక్యం ద‌క్కింది. ఈ మ్యాచ్ లో కేవ‌లం ముగ్గురు పేస‌ర్లు మాత్ర‌మే బ‌రిలోకి దిగ‌గా, వారే ఇంగ్లాండ్ ఆలౌట్ చేయ‌డం విశేషం. ఇక ఇంగ్లాండ్ వెట‌ర‌న్ పేస‌ర్ క్రిస్ వోక్స్ గాయం కార‌ణంగా ఈ టెస్టులో అందుబాటులో ఉండ‌టం లేదు. దీంతో ముగ్గురు పేస‌ర్ల‌తోనే ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయించ‌నుంది. ఇక వీలైనంత ఎక్కువ ప‌రుగులు చేసి, ఇంగ్లాండ్ కు కాస్త క‌ష్ట సాధ్య‌మైన టార్గెట్ నిర్దేశించాల‌ని టీమిండియా ప‌ట్టుద‌ల‌గా ఉంది. అలాగే ఈ మైదానంలో అత్య‌ధిక ఛేద‌న 263 కావ‌డం విశేషం. ఇంగ్లాండ్ కు అంత‌కంటే ఎక్కువ టార్గెట్ విధించాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.