Karun Nair 50 & Gus Atkinson Fifer: ఇంగ్లాండో తో జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. సవాలు విసిరే ఈ పిచ్ పై శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే తొలి ఇన్నింగ్స్ లో 69.4 ఓవర్లలో 224పరుగులకు ఆలౌటైంది. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ అర్ద సెంచరీ (109 బంతుల్లో 57, 8 ఫోర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లీష్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ ఫైఫర్ (5/33)తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లోనే చోటులో దక్కించుకున్న కరుణ్.. జట్టులో ఏకైక ఫిఫ్టీతో తన స్థానానికి న్యాయం చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ కు గాయం కారణంగా క్రిస్ వోక్స్ దూరమయ్యాడు.
అరగంటలోనే..టెయిలెండర్లు త్వరగా ఔటయ్యే బలహీనతను టీమిండియా మరోసారి ప్రదర్శించింది. శుక్రవారం రెండోరోజు ఉదయం 204/6 తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ మరో 20 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. 218 పరుగుల వద్ద కరుణ్ ను జోష్ టంగ్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ తర్వాత గస్ అట్కిన్సన్ త్వరగా మూడు వికెట్లను తీసి, ఫైఫర్ ను నమోదు చేశాడు. వరుసగా వాషింగ్టన్ సుందర్ (26), మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ లను డకౌట్ చేశాడు. దీంతో ఓ మాదిరి స్కోరుకే టీమిండియా పరిమితమైంది. ఈ వికెట్ పై 280 పరుగుల యావరేజీ స్కోరు కాగా, టీమిండియా ఆ మార్కును దాటలేక పోయింది.
ముగ్గురితోనే..ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ లైనప్ లో ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగింది. మహ్మద్ సిరాజ్ వరుసగా సిరీస్ లో ఐదో టెస్టు ఆడుతుండగా, ప్రసిధ్, ఆకాశ్ దీప్ రీ ఎంట్రీ ఇచ్చారు. కేవలం ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగుతుండటంతో వీలైనంత త్వరగా వికెట్లను తీయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఇరుజట్లు నాలుగేసి మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, జస్ ప్రీత్ బుమ్రా ల స్తానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిధ్, ఆకాశ్ దీప్ బరిలోకి దిగుతున్నారు. ఇక ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్స్, లియామ్ డాసన్ లు ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. వారి స్థానాల్లో జాకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జామీ ఒవర్టన్ లు జట్టులోకి వచ్చారు. ఇక ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.