Ind Vs Eng Oval Test Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ పుంజుకుంది. ఒకదశలో వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా.. ఆట ఆఖరికి ఫర్వాలేదనిపించేలా ఆడుతోంది. లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఆఖరి దైన ఈ ఐదో టెస్టులో గురువారం తొలిరోజు ఆటముగిసేసరికి 64 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ అజేయ అర్ద సెంచరీ(98 బంతుల్లో 52 బ్యాటింగ్, 7 ఫోర్లు) తో ఆకట్టుకున్నాడు. క్రీజులో కరుణ్ తోపాటు వాషింగ్టన్ సుందర్ (19 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఐదు టెస్టుల అండర్సన్ -టెండూల్కర్ ట్రోఫీలో వరుసగా ఐదోసారి కూడా ఇండియా టాస్ ను ఓడిపోయింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కు శుభారంభం దక్కకపోయినా, చాలెంజింగ్ పిచ్ పై గౌరవప్రదమైన స్కోరు దిశగా సాగుతోంది.
విఫలమైన ఓపెనర్లు..క్లౌడ్ కవర్, పచ్చికతో చాలెంజింగ్ పిచ్ గా ఉన్న ద ఓవల్ పిచ్ పై భారత ఓపెనర్లు తొలిసారి విఫలమయ్యారు. ఆట ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (2)ను అట్కిన్సన్ ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38) తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (14) కాసేపు చిన్న భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే కుదురుగా ఆడుతున్న రాహుల్ ను క్రిస్ వోక్స్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే లేని పరుగు కోసం ప్రయత్నించి కెప్టెన్ శుభమాన్ గిల్ (21) రనౌట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది.
ఆదుకున్న కరుణ్..ఈమ్యాచ్ ను చివరి చాన్స్ గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ మాత్రం అదరగొట్టాడు. ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అయితే మరో ఎండ్ లో బాగా ఆడుతున్న సుదర్శన్ ను టంగ్ అద్భుత బంతితో ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే రవీంద్ర జడేజా (9)ను కూడా సేమ్ అలాంటి బంతితోనే టంగ్ పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో గాయపడని విధ్వంసక వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో ఆడుతున్న ధ్రువ్ జురెల్ (19) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ తో కలిసి మ్యాచ్ టర్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఏడో వికెట్ కు 51 పరుగులు జోడించి, మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో తొలి రోజు 26 ఓవర్ల ఆటకు నష్టం కలిగింది.