Ind Vs Eng Oval Test Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఒల్లీ పోప్ బౌలింగ్.. ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలనే టార్గెట్ తో టీమిండియా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు చాలా మార్పులు చేశాయి. భారత జట్టు గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ను ఆడిస్తోంది. అలాగే పేసర్లలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణ, ఆకాశ్ దీప్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్ ను ఆడిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్లేయింగ్ లెవన్ ను ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టు నాలుగు మార్పులు చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఐదు టెస్టుల అండర్సన్ -టెండూల్కర్ ట్రోఫీని 3-1 తో కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. మరోవైపు నాలుగో టెస్టును అద్బుత పోరాటంతో డ్రాగా ముగించిన భారత్.. సమరోత్సాహంతో ఈ టెస్టును కూడా నెగ్గి, సిరీస్ ను 2-2తో కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
కొత్త కెప్టెన్ నాయకత్వంలో..ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. సిరీస్ లో 17 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. గత మ్యాచ్ లో తను భారీ సెంచరీ (140) కూడా చేశాడు. అలాగే ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అలాగే తన భిన్య వ్యూహాలతో టీమ్ ను నడిపించాడు. అలాంటి ఆటగాడు దూరం కావడంతో ఇంగ్లాండ్ వెనుకంజలో నిలిచింది. ఇక భీకర పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. నాలుగో టెస్టులో ఆడిన లియామ్ డాసన్, బ్రైడెన్ కార్స్ లను కూడా తప్పించారు. ఈ నలుగురి స్థానంలో జాకబ్ బెతెల్, జోష్ టంగ్, జేమీ ఒవర్టన్, గస్ అట్కిన్సన్ లు ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా ఒల్లీ పోప్ బరిలోకి దిగుతున్నాడు. పిచ్ పై గ్రాస్ ఎక్కువగా ఉంది. దీంతో నలుగురు జెన్యూన్ పేసర్లతో బరిలోకి దిగుతోంది. స్పెషలిస్టు పేసర్ గా లేకుండానే ఆడుతోంది.
ఆత్మవిశ్వాసంతో టీమిండియా..గత మ్యాచ్ లో ప్రత్యర్థికి 311 పరుగుల ఆధిక్యం సమర్పించుకుని, 0-2తో నిలిచిన దశలో అద్భుతంగా పోరాడి ఆ మ్యాచ్ ను డ్రాగా ముగించింది. శుభమాన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలతో అదరగొట్టారు. అలాగే కేఎల్ రాహుల్ 90 పరుగులతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ లో గతానికి భిన్నంగా పేస్ వికెట్ ను రూపొందించారు. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ ఎలా ఆడుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక చివరి సారి ఇక్కడ ఆడినప్పుడు భారత్ అద్బుత విజయాన్ని సాధించింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని ఇండియా భావిస్తోంది.