Bazball: ‘బజ్‌బాల్’.. సుమారు 14 నెలల కాలంగా  టెస్టు క్రికెట్  ఆటతీరును మార్చేస్తున్న ఇంగ్లాండ్ వాళ్ల ఆటకు  పెట్టుకున్న పేరు.  స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇండియా వంటి జట్లను ఓడించిన   ఇంగ్లాండ్.. రెండ్రోజుల క్రితమే ఆస్ట్రేలియాతో ముగిసిన యాషెస్‌లో కూడా కంగారూలను కంగారెత్తించింది.  కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ల ధ్వయం.. ఇంగ్లాండ్ క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్  ప్రేమికులకు ఉర్రూతలూగిస్తున్న ఈ బజ్‌బాల్‌కు అసలు  పరీక్ష ఎదురయ్యేది భారత పర్యటనలోనే అన్నది విశ్లేషకుల వాదన. 


వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరిలో ఇంగ్లాండ్.. భారత్‌కు రానున్న నేపథ్యంలో యాషెస్ సిరీస్ ముగిశాక పలువురు రిపోర్టర్లు స్టోక్స్‌ను‘మీ బజ్‌బాల్ ఇండియాలో వర్కవుట్ అవుతుందా..?’ అని అడిగారు. దానికి స్టోక్స్ సమాధానం చెబుతూ.. ‘మేం స్వదేశంలో న్యూజిలాండ్‌ను 3-0 తేడాతో ఓడించాం.  అయితే మేం సౌతాఫ్రికాపై కూడా ఇదే రిపీట్ చేయలేకపోయాం. కానీ పాకిస్తాన్‌ను వారి దేశంలోనే క్లీన్ స్వీప్ చేశాం. ఇప్పుడు ఆస్ట్రేలియానూ ఓడించినంత పని చేశాం. ఇక ఇండియాపై ఇలాంటి ఫీట్ రిపీట్ అవుతుందా..? అంటే ఏమో నేను కచ్చితంగా చెప్పలేను. దానిని టైమ్ డిసైడ్ చేస్తుంది’ అని చెప్పాడు. 


స్పిన్ పిచ్‌ల మీద ఆడితేనే కదా.. 


స్టోక్స్  - మెక్‌కల్లమ్ ధ్వయం నాయకత్వంలో  ఇంగ్లాండ్ ఇప్పటివరకూ 18 టెస్టులలో 14 గెలిచింది. అయితే ఇందులో స్వదేశంలో ఆడినవే ఎక్కువ. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు పేసర్లతో పాటు బ్యాటర్లకూ అనుకూలంగా ఉంటాయి. ఇక పాకిస్తాన్ పర్యటనలో రావల్పిండి, ముల్తాన్, కరాచీ పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్నాయని, అసలు  రావల్పిండి పిచ్ అయితే టెస్టు క్రికెట్‌కు పనికొచ్చే కాదని విమర్శలు వెల్లువెత్తాయి.  తొలి టెస్టులో ఇంగ్లాండ్ అక్కడ 500కు పైగా పరుగులు చేయడం గమనార్హం.  ఇక్కడ కూడా స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ టూర్‌లో కూడా ఇంగ్లాండ్ పేస్ పిచ్‌ల మీదే  సవారీ చేసింది.  కానీ భారత్ వీటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ టెస్టులలో తొలి రోజు తొలి సెషన్ నుంచే బంతి గింగిరాలు తిరుగుతుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్న స్పిన్ త్రయాన్ని తట్టుకుని  ఇంగ్లాండ్ దూకుడు కొనసాగించగలుగుతుందా..? అనేది  మిలియన్ డాలర్ల ప్రశ్న. 


ఇంగ్లాండ్  గత రెండు పర్యటనలలో భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. స్పిన్ ఆడటంలో ఆ జట్టు  బ్యాటర్లు కూడా తడబడుతున్నారు. ఇందుకు యాషెస్‌లో రెండు టెస్టులే నిదర్శనం.  ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్‌లో జరిగిన  టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఇబ్బందులు పడింది. ఆసీస్ గెలిచింది కూడా ఈ రెండు టెస్టులే.. ఆ తర్వాత  లియాన్‌కు గాయం కావడంతో  వరల్డ్ బెస్ట్ పేసర్స్ అయినా  స్టార్క్, హెజిల్‌వుడ్, కమిన్స్‌‌ల బౌలింగ్‌ను ఆటాడుకుంది.  


ఆసీస్‌కు భంగపాటు.. 


ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా కూడా తాము బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటామని, ఆ మేరకు  స్పిన్ పిచ్‌లు, భారత స్పిన్నర్లను పిలిపించుకుని  ప్రాక్టీస్ చేసింది.  కానీ  ఫలితం మాత్రం మారలేదు. నాగ్‌పూర్, ఢిల్లీలతో పాటు ఇండోర్‌లో కూడా కంగారూలు ఇబ్బందులుపడ్డారు. సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ గెలుచుకుంది.   అశ్విన్, జడేజాల ధాటికి  ఆసీస్ ఆగమైంది.  


తక్కువ అంచనా వేయలేం.. 


స్పిన్ ఆడటంలో ఇబ్బందులు ఉన్నా ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ఇదే దూకుడు మంత్రంతో ఉన్నా ఇంగ్లాండ్ 50 ఓవర్లు మాత్రమే ఆడినా ఆ జట్టు 250 పరుగులు చేయగలదు.  ఆ స్కోరును భారత్ దాటగలదా..? అన్నదే  అసలు సవాల్. టీమిండియాలో కూడా  స్పిన్‌ను గొప్పగా ఆడే బ్యాటర్లు ఇద్దరు ముగ్గురు మాత్రమే.  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత స్పిన్నర్ల మాదిరిగానే ఆసీస్ స్పిన్నర్ల ధాటికీ  టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఢిల్లీ టెస్టులో  110 పరుగులు  చేయడానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇండోర్ టెస్టులో అయితే  ఒక్క బ్యాటర్ కూడా నిలదొక్కుకోలేదు. ఇంగ్లాండ్ లో లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్  ప్రమాదకారి. 2021లో అహ్మదాబాద్ టెస్టులో  ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్  కూడా ఐదు వికెట్లు తీసిన విషయం మరిచిపోరాదు.  ఇలాంటి ప్రదర్శనలు పునరావృతమైతే అది భారత్‌కు భారీ షాకే..  


ప్లాట్, పేస్‌కు అనుకూలించే పిచ్‌ల మీద  బౌలర్లపై ఎదురుదాడికి దిగినంత ఈజీగా స్పిన్నర్లపై అటాకింగ్ గేమ్ వర్కవుట్ అవదు. మరి టెస్టు క్రికెట్ రూపురేఖలు మారుస్తున్న బజ్‌బాల్.. ఇండియాలో వర్కవుట్ అవుతుందా..? లేదా..? అన్నది కాలమే నిర్ణయించాలి. 



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial