West Indies squad: భారత్ తో ఈనెల 12 నుంచి జరుగబోయే తొలిటెస్టుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన ఈ జట్టులో ఇద్దరు కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వగా ఈ టీమ్ కు క్రెయిగ్ బ్రాత్వైట్ సారథ్యం వహించనున్నాడు. రెండేండ్ల తర్వాత స్పిన్ ఆల్ రౌండర్ రకీం కార్న్వాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇద్దరు చిచ్చరపిడుగులే..
విండీస్ బోర్డు ప్రకటించిన జట్టులోకి వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు కిర్క్ మెకంజీ, అలిక్ అథనాజ్ లు దేశవాళీతో పాటు వెస్టిండీస్ ‘ఎ’ తరఫున గతకొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నారు. ఈ ఇద్దరూ ఎడమ చేతి వాటం బ్యాటర్లే కావడం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అథనాజ్.. 30 మ్యాచ్ లు ఆడి 1,825 పరుగులు చేయగా మెకంజీ 9 మ్యాచ్ లలోనే 591 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ ఇటీవలే బంగ్లాదేశ్ - ‘ఎ’తో జరిగిన మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శనలు చేశారు.
వీరి ఎంపికపై చీఫ్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ.. ‘మెకంజీ, అథనాజ్ ల దేశవాళీ, విండీస్ ఎ తరఫున ప్రదర్శనల పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం. వాళ్లు మెరుగ్గా ఆడటమే గాక ఆటలో పరిణితి చూపిస్తున్నారు. ఈ ఇద్దరూ తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతున్నాం’ అని చెప్పాడు. మరి ఈ ఇద్దరూ తమకు దొరికిన అవకాశాన్ని ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
సీల్స్, మేయర్స్ ఔట్..
ఆరు నెలల తర్వాత ఇటీవలే బోర్డు ఎంపిక చేసిన ట్రైనింగ్ క్యాంప్ కు హాజరైన పేసర్ జైడన్ సీల్స్ ఇంకా గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో సెలక్టర్లు ఫస్ట్ టెస్టుకు అతడిని పట్టించుకోలేదు. అలాగే విధ్వంసకర ఓపెనర్ కైల్ మేయర్స్ కూడా గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ కూడా గాయంతో దూరమవడంతో అతడి స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ రకీంను ఎంపిక చేశారు సెలక్టర్లు.. రకీం చివరిసారి 2021లో టెస్టు ఆడాడు.
తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు : క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్ వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగినరైన్ చందర్పాల్, రకీం కార్న్వాల్, జోషువా డ సిల్వ, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జొమెల్ వారికన్
ట్రావెలింగ్ రిజర్వ్స్ : టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్
ఇండియా - వెస్టిండీస్ టెస్ట్ షెడ్యూల్ :
- జులై 12 నుంచి 16 వరకూ తొలి టెస్టు : డొమినికా
- జులై 20 నుంచి 24 వరకూ రెండో టెస్టు : ట్రినిడాడ్
భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు మొదలవుతాయి.