WI ODI Squad: నెలరోజుల పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌లో ఉన్న  భారత క్రికెట్ జట్టు..   టెస్టు సిరీస్ ముగించుకుని వన్డేలు ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 27 నుంచి  స్వదేశంలో విండీస్.. టీమిండియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు  విండీస్ క్రికెట్ బోర్డు  15 మందితో కూడిన  జట్టును ప్రకటించింది. ఇటీవలే జింబాబ్వే వేదికగా   ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో  దారుణ పరాజయాలతో  ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. వీలైనంత త్వరగా కోలుకోవాలంటే  భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాల్సిందే.  ఈ నేపథ్యంలో  వన్డే సిరీస్ ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంది. 


హెట్‌మెయిర్ రీఎంట్రీ.. 


15 మందితో కూడిన ఈ జట్టును  షై హోప్ నడిపించనున్నాడు.  టీ20 స్పెషలిస్ట్, ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడే  షిమ్రన్ హెట్‌మైర్‌ను  జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగించేదే.  హెట్‌మైర్‌.. గడిచిన ఏడాదిన్నర కాలంగా  విండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా జాతీయ జట్టుకు  ఆడటమే మానేశాడు. కానీ తాజాగా భారత్‌తో వన్డే సిరీస్‌లో అతడిని చేర్చడం గమనార్హం. 


హెట్‌మైర్‌తో పాటు  పేసర్  ఓషేన్ థామస్ కూడా  చాలాకాలం తర్వాత  జట్టులో చోటు దక్కించుకున్నాడు.  టెస్టు సిరీస్‌కు వస్తాడనుకున్న  జేడన్ సీల్స్‌కు కూడా వన్డేలలో  చోటు దక్కింది.   లెగ్ స్పిన్నర్ యానిక్ కారియా  టీమ్ లోకి వచ్చారు. 


 






జట్టు ఎంపికపై విండీస్ బోర్డు చీఫ్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ.. ‘ఓషేన్, హెట్‌మైర్‌లకు మేం స్వాగతం చెబుతున్నాం.   ఈ ఇద్దరూ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో తామెంటో నిరూపించుకున్నారు. ఈ ఇద్దరూ భారత్‌తో ఆడబోయే సిరీస్‌లో ఫిట్‌గా ఉండి రాణిస్తారని మేం ఆశిస్తున్నాం..’అని  చెప్పాడు. కాగా విండీస్ జట్టులో కీలక ఆటగాడైన నికోలస్ పూరన్‌తో పాటు  పేసర్ జేసన్ హోల్డర్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు.  పూరన్ ప్రస్తుతం  అమెరికా వేదికగా జరుగుతున్న  మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో  ఎంఐ న్యూయార్క్  తరఫున ఆడుతుండగా  టెస్టు సిరీస్ ఆడిన జేసన్ హోల్డర్‌కు సెలక్టర్లు  విశ్రాంతినిచ్చారు.   ఇక టెస్టులలో విండీస్ తరఫున ఆడిన పలువురు వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు.  ఐపీఎల్-16లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన కైల్ మేయర్స్ వన్డే జట్టులోకి వచ్చాడు. 


భారత్‌తో వన్డేలకు విండీస్ జట్టు :  షై హోప్ (కెప్టెన్), రొవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్‌మైర్‌, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోతీ,  జేడన్ సీల్స్, రొమారియా షెపర్డ్, కెవిన్ సింక్లేయర్, ఓషేన్ థామస్ 


భారత్ - వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ : 


- జులై 27 : తొలి వన్డే -  బార్బోడస్ 
- జులై 29 : రెండో వన్డే - బార్బోడస్
- ఆగస్టు 01 : మూడో వన్డే - ట్రినిడాడ్ 





























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial