Kylian Mbappe: ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఆటగాడు, 2018లో ఆ జట్టుకు ఫిఫా వరల్డ్ కప్ అందించడమే గాక గతేడాది కూడా దాదాపు గెలిపించినంత పనిచేసిన సంచలనం కిలియన్ ఎంబాపె త్వరలోనే ఫుట్‌బాల్ క్లబ్ మారనున్నాడు. యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మన్ (పీఎస్‌జీ) తరఫున ఆడుతున్న ఎంబాపె ఒప్పందం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతడిని దక్కించుకోవడానికి సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ హిలాల్’ ఎంబాపెకు యేటా 332 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2720 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
వాస్తవానికి ఎంబాపె.. 2022 జూన్‌లోనే పీఎస్‌జీలో చేరాడు. ఒప్పందం ప్రకారం అతడి గడువు 2024 వరకూ ఉంది. కానీ ఎంబాపె మాత్రం తన కాంట్రాక్టును పునరుద్ధరించాలనుకోవడం లేదు. ఇదే విషయాన్ని అతడు పీఎస్‌జీ యాజమాన్యానికి కూడా తెలిపాడు. పీఎస్‌జీ అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించాలని భావిస్తున్నా ఎంబాపె మాత్రం ఆ క్లబ్‌ను వీడేందుకే నిశ్చయించుకున్నాడట. దీంతో పీఎస్‌జీ.. అతడిని వేరే క్లబ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని భావిస్తోంది. ఇందుకు గాను పలు ఫ్రాంచైజీలతో బేరసారాలూ నడుస్తున్నాయి.
తాజా సమాచారం మేరకు సౌదీకి చెందిన ‘అల్ హిలాల్’ అతడితో రెండున్నరేండ్ల ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. దీనికి గాను యేటా రూ. 2,720 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధమైంది. అంటే రెండున్నరేండ్లకు ఎంబాపెకు దక్కేది సుమారు రూ. 6 వేల కోట్లకు పైనే ఉంటుంది. ఇదే జరిగితే మాత్రం ఈ ఏడాది దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో డీల్ కంటే కూడా ఇదే ఎక్కువ కాబోతుంది.
ఫిఫా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రొనాల్డో.. సౌదీకే చెందిన ‘అల్ నసర్’తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేండ్ల కాలానికి గాను అల్ నసర్ అతడితో డీల్ చేసుకుంది. ఇందుకోసం యేటా రూ. 1,770 కోట్లు చెల్లించనుంది. ఫుట్‌బాల్ చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్. కాగా రొనాల్డోతో పాటు అర్జెంటీనా సారథి, ఇటీవలే తన దేశానికి ఫిఫా వరల్డ్ కప్ అందించిన లియోనల్ మెస్సీ కూడా భారీ ధరకు ఇంటర్ మియామికి వెళ్లాడు. ఈ మాజీ పీఎస్‌జీ స్టార్ ప్లేయర్.. ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్ (ఇంగ్లాండ్).. అమెరికాలో యజమానిగా ఉన్న ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్నాడు. రెండేండ్ల సీజన్‌కు గాను మెస్సీ కాంట్రాక్ట్ విలువ సుమారు రూ. 1,200 కోట్లుగా ఉంది.
ఎంబాపె చూపు రియల్ మాడ్రిడ్ వైపు..
ఎంబాపెను దక్కించుకునేందుకు అల్ హిలాల్ రెడీ అవుతున్నా అతడు మాత్రం ‘లా లిగా’లో పోటీ పడే రియల్ మాడ్రిడ్‌కు ఆడటానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇదివరకే రియల్ మాడ్రిడ్‌తో లోలోపల ఒప్పందాలు కూడా జరిగాయని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందనీ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రియల్ మాడ్రిడ్‌కు వెళ్తే అది సౌదీ డీల్ కంటే పెద్దదే అయి ఉంటుందని ఫుట్‌బాల్ అభిమానులు భావిస్తున్నారు. ఎంబాపె ట్రాన్స్‌ఫర్‌పై అధికారిక ప్రకటన వెలువడేదాకా ఈ యువ సంచలనం ఏ జట్టుకు ఆడతాడనేది సస్పెన్సే..!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial