Mohammed Siraj: భారత్ ఇంగ్లాండ్‌పై ఓవల్ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో సాధించిన ఉత్కంఠభరిత విజయం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐదో రోజున మహ్మద్ సిరాజ్ వేసిన డేంజరస్ బౌలింగ్తో ఇంగ్లాండ్‌ను 367 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. సిరాజ్ ఆ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీశాడు, దీని కారణంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) అవార్డు విజేతలకు బహుమతులు అందించింది, అయితే సిరాజ్ ఆ బహుమతిని తీసుకోలేదు.

ఓవల్ టెస్ట్ తర్వాత మహ్మద్ సిరాజ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక చేశారు. గౌతమ్ గంభీర్, బ్రెండన్ మెకల్లమ్ వరుసగా హ్యారీ బ్రూక్, శుభ్‌మన్ గిల్ లను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపిక చేశారు. ఈ అవార్డు విజేతలకు ECB మ్యాచ్ తర్వాత షాంపైన్ బాటిల్‌ను బహుమతిగా ఇచ్చింది, అయితే మహ్మద్ సిరాజ్ దానిని తీసుకోలేదు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ షాంపైన్ బాటిల్‌ను స్వీకరించాడు, కాని సిరాజ్‌కు గౌరవంగా అతను బాటిల్‌ను ఓపెన్ చేయలేదు.

మహ్మద్ సిరాజ్ షాంపైన్ బాటిల్‌ను తీసుకోలేదు, ఎందుకంటే ఇస్లాంలో మద్యం సేవించడం హరామ్ (నిషిద్ధం). ఈ సంవత్సరం IPL 2025 ప్రారంభానికి ముందు సిరాజ్ హజ్ యాత్రకు కూడా వెళ్ళిన సంగతి తెలిసిందే.

సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేసి, ఆపై...

మహ్మద్ సిరాజ్, భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలో మొత్తం 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు, అదే సమయంలో అతను 23 వికెట్లు తీశాడు. ఇన్ని ఓవర్లు, నెట్స్‌లో ప్రాక్టీస్, చాలా రోజుల ఫీల్డింగ్ తర్వాత సిరాజ్ మాత్రమే కాదు, ఏ ఆటగాడి శరీరమైనా అలసిపోతుంది. అయినప్పటికీ, అతను ఓవల్ టెస్ట్‌లో ఐదో రోజున గంటకు 143 కిమీ వేగంతో బంతిని విసిరి అట్కిన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత, ఐసిసి తన తాజా టెస్ట్ ర్యాంక్‌లను విడుదల చేసింది. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ర్యాంక్ టెస్ట్ బౌలర్‌గా ఆధిపత్యం చెలాయించగా, ఇంగ్లాండ్‌కు చెందిన గస్ అట్కిన్సన్, భారతదేశానికి చెందిన మొహమ్మద్ సిరాజ్ గణనీయమైన పురోగతి సాధించారు. 

ఓవల్ అద్భుత ప్రదర్శన తర్వాత సిరాజ్ ర్యాంక్స్లో దూసుకుపోయాడు. కెన్నింగ్టన్ ఓవల్ టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసిన మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో అతను 12 స్థానాలు పైకి ఎగబాకాడు. 27వ ర్యాంక్ నుంచి, భారత పేసర్ ఇప్పుడు ప్రపంచంలో 15వ స్థానంలో ఉన్నాడు. ICC టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అతని కెరీర్ అత్యుత్తమ స్థానం.

రవీంద్ర జడేజా మూడు స్థానాలు దిగజారాడు. ఇప్పుడు అతను 14వ స్థానం నుంచి 17వ స్థానానికి తగ్గాడు. ప్రసిద్ధ్ కృష్ణ భారీ పురోగతి సాధించి 25 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరుకున్నాడు. ఆకాశ్దీప్‌, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ ఆరు స్థానాలు దిగజారారు.