భారత క్రికెట్ జట్టు ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌ను డ్రా చేసుకుంది. భారత జట్టును ఓటమి అంచునుంచి విజయాలకు చేర్చిన కీలక ఆటగాళ్లలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ ఒకడు. ఈ  ఫాస్ట్ బౌలర్ సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించాడు. 23 వికెట్లతో సిరీస్ లో భారత్, ఇంగ్లాండ్ రెండు జట్ల నుంచి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ముఖ్యంగా ఇండియా చివరి మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ సిరాజ్ 5 వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను ఓడించగలిగింది. ఇంగ్లాండ్‌పై సిరీస్ ఓటమిని తప్పించుకుని సగర్వంగా డ్రా చేసుకున్న తరువాత ఎటు చూసినా మహ్మద్ సిరాజ్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. సిరాజ్ లైఫ్ స్టైల్, శాలరీ, అతడి గత ప్రదర్శనలకు సంబంధించిన రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహ్మద్ సిరాజ్ టీమిండియాకు చేస్తున్న సేవలు గుర్తించి అతనికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్ట్ ఇచ్చింది. భారత జట్టుకు అపూర్వ విజయాలలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌కు పదవి ఇవ్వడం గౌరవంగా భావిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆ సమయంలో అన్నారు. బీసీఐ, ఐపీఎల్ ద్వారా సిరాజ్‌కు కోట్ల రూపాయల ప్యాకేజీ వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే డీఎస్పీ ఉద్యోగం ద్వారా సిరాజ్ ఎంత జీతం తీసుకుంటున్నాడు. త్వరలో 8వ వేతన సంఘం అమలు చేస్తే, అతని జీతం ఎంత పెరుగుతుంది అని ట్రెండింగ్ అవుతోంది. 

తెలంగాణ పోలీసులలో DSP పదవికి జీతం ఎంత?

తెలంగాణలో DSPగా నెలకు 58,850 నుంచి 1,37,050 వరకు జీతం లభిస్తుంది. మహ్మద్ సిరాజ్‌కు సైతం అదే రీతిలో వేతనం అందుతుంది. దీంతో పాటు అతనికి ఇంటి అద్దె అలవెన్స్ (HRA), మెడికల్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. ఈ జీతం 7వ వేతన సంఘం కింద అందుకుంటున్నాడు సిరాజ్. దీనిలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు.

8వ వేతన సంఘంతో సిరాజ్ జీతం ఎంత 

త్వరలో దేశంలో 8వ వేతన సంఘం అమలు చేస్తే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ దాదాపు 2.57కి పెరగవచ్చు. దీనివల్ల సిరాజ్ వంటి DSP అధికారుల జీతంలో భారీగా పెరుగుదల ఉంటుంది. అప్పుడు సిరాజ్ కనీస జీతం 80,000 రూపాయల కంటే ఎక్కువ కావచ్చు. గరిష్ట వేతనం 1.85 లక్షలకు చేరుకుంటుందని సమాచారం.

మహ్మద్ సిరాజ్ ప్రయాణం

హైదరాబాద్ వీధుల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు మహ్మద్ సిరాజ్. నేడు భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహ్మద్ సిరాజ్ ప్రయాణం ఒక సినిమా కథ కంటే తక్కువ కాదని అతడ్ని దగ్గర్నుంచి చూసిన వారు చెబుతారు. సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్, కాగా తల్లి సాధారణ గృహిణి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకుటి నిలబడ్డాడు. ఎంతగానో శ్రమించి అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో 2 టెస్టుల్లో బుమ్రా లేకపోతే ముందుండి ఆ మ్యాచ్ లలో భారత్ జట్టుకు విజయాలు అందించాడు. కేవలం తెలంగాణ యువతకే కాదు నేడు యావత్ భారతదేశంలో యువతకు స్ఫూర్తిగా నిలిచాడు సిరాజ్.