Rohit Sharma Retirement: రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీం ఇండియా ఓటమి తర్వాత రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ కొనసాగినా కెప్టెన్సీ మార్పు జరిగే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. 

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, యువ ఆటగాళ్లకు బాధ్యత అప్పగించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఒకవేళ రోహిత్ శర్మ ఈ 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి రిటైర్ అయితే, వన్డేల్లో భారత జట్టుకు ఎవరు కెప్టెన్ అవుతారో ఇక్కడ తెలుసుకుందాం.

భారత జట్టుకు వన్డే కెప్టెన్ ఎవరు?

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఇటీవల టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఒకవేళ వన్డేల నుంచి రోహిత్ శర్మ రిటైర్ అయితే, పరిస్థితి ఏంటని పెద్ద ప్రశ్న తలెత్తవచ్చు. ఇటీవల శుభ్‌మాన్ గిల్‌ను భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. గిల్ పేరుతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ పేర్లు వినిపించగా.. చివరికి హెడ్ కోచ్ గౌతం గంభీర్, సెలెక్టర్లు గిల్ వైపు మొగ్గుచూపారు. 

రోహిత్ శర్మ తర్వాత, వన్డేల్లో భారత జట్టు కెప్టెన్ రేసులో ఐదుగురు ఆటగాళ్ల పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. వారు గిల్, హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్. అయతే రాహుల్ కు పగ్గాలు ఇచ్చే అవకాశం తక్కువే. పాండ్యా తరచు గాయాలపాలవుతుంటాడు. గిల్, అయ్యర్, పంత్ మధ్య వన్డే కెప్టెన్సీ కోసం పోటీ ఎదురవుతుంది. టెస్టులకు ఎలాగూ కెప్టెన్ చేశారు కనుక శుభ్‌మన్ గిల్ వన్డేల్లోనూ సారథ్య బాధ్యతలు అందుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రిషబ్ పంత్, అయ్యర్‌ల నుంచి గిల్‌కు పోటీ ఎదురవ్వొచ్చు. ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కెప్టెన్ బదులుగా రోహిత్ ఉన్న సమయంలోనే కెప్టెన్సీ పగ్గాలు మరో ప్లేయర్‌కు దక్కడాన్ని కొట్టిపారేయలేం. 

వన్డేల్లో కెప్టెన్‌గా రేసులో అయ్యర్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్ గత 4 ఐపీఎల్ సీజన్లలో కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. బ్యాటర్‌గానూ సత్తా చాటుతున్నాడు. దేశవాలీలోనూ మ్యాచ్‌లాడి మరింత రాటుదేలాడు. గిల్, అయ్యర్‌లలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తారో నని క్రికెట్ ప్రేమికులు అప్పుడే డిస్కషన్ మొదలుపెట్టారు. 

3 ఫార్మాట్లు, ముగ్గురు కెప్టెన్లుభారత జట్టుకు ప్రస్తుతం 3 ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. వన్డేల్లో రోహిత్ శర్మ, టెస్టుల్లో కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో  భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. రోహిత్ శర్మ వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. కానీ కెప్టెన్‌గా హిట్ మ్యాన్‌నే కొనసాగిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు.