Ind Vs Eng 5 Test Series Updates: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2025-27 సైకిల్ ను ఈసారి విదేశాల్లో భారత్ ప్రారంభించబోతోంది. ఐదు టెస్టుల సిరీస్ తో ప్రతిష్టాత్మక పోరును మొదలు పెట్టనుంది. ఇంగ్లాండ్ తో ఈనెల 20 నుంచి లీడ్స్ మైదానంలో జరిగే తొలి టెస్టు ద్వారా చాలెంజింగ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇక ఈ సారి దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా ఈ టూర్ చేస్తోంది. పేపర్ పై అంత అనుభవం లేకుండా కనిపిస్తున్న భారత జట్టులో ప్రతిభకు కొదువలేదు. ఇప్పటికే దేశవాళీతోపాటు వివిధర రకాల ఎన్నో మ్యాచ్ ల్లో రాణించిన అనుభవం భారత్ సొంతం. అయితే ఈ సిరీస్ లో అందరి దృష్టి భారత బ్యాటింగ్ లైనప్ పైనే ఉంది. సరికొత్తగా ప్రారంభం కాబోతున్న ఈ లైనప్ లో ఎవరెవరు ఆడాలో, ఇప్పటికే పలువురు దిగ్గజాలు సూచనలు చేశారు. తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప.. ఇంగ్లాండ్ లో బరిలోకి దిగబోయే భారత బ్యాటింగ్ లైనప్ పై వ్యాఖ్యానించాడు.
ఓపెనర్లుగా..ఒక ఒపెనర్ గా యశస్వి జైస్వాల్ ఖాయం కాగా, ప్రస్తుత టూర్లో సత్తా చాటిన సీనియర్ బ్యాటర్ లోకేశ్ రాహుల్ ను జైస్వాల్ కు తోడుగా ఓపెనింగ్ చేయించాలని సూచిస్తున్నాడు. ప్రస్తుత టూర్లో ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో ఒక సెంచరీ, ఫిఫ్టీతో సత్తా చాటాడు. అలాగే గతంలో ఇంగ్లాండ్ తోపాటు ఆసీస్ లోనూ రాణించిన అనుభవం అతని సొంతమని చెప్పాడు. ఇక నెంబర్ త్రీలో ఐపీఎల్లో విశేషంగా రాణించిన సాయి సుదర్శన్ ను తీసుకోవాలని సూచిస్తున్నాడు. దీంతో టాప్ త్రీ బలంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇక నాలుగో నెంబర్లో కెప్టెన్ శుభమాన్ గిల్, ఐదో స్థానంలో అనుభవం గల కరుణ్ నాయర్ ను ఆడించాలని సూచించాడు. అప్పుడే బ్యాటింగ్ లో స్థిరత్వం ఉంటుందని పేర్కొన్నాడు. ఇక ఆరో నెంబర్లో డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను బరిలోకి దించాలని పేర్కొన్నాడు.
ఇద్దరు ఆల్ రౌండర్లు..ఇక ఏడో స్థానంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించాలని సూచించాడు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా ఆడిస్తే, అటు నాలుగో పేసర్ గానూ, ఇటు బ్యాటింగ్ లోనూ డెప్త్ ఉంటుందని పేర్కొన్నాడు. ఎనిమిదో స్థానంలో వెటరన్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఆడించాలని సూచించాడు. దీంతో కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టాలని పేర్కొన్నాడు. ఇక పేస్ బాధ్యతలను జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలకు అప్పగించాలని, వీరికి తోడుగా నాలుగో పేసర్ గా నితీశ్ ఉంటాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు ఇదే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. తాజా లైనప్ తో జట్టు సమతూకంతో ఉందని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా అటు కోచ్ గౌతం గంభీర్, ఇటు కెప్టెన్ గిల్ ఆలోచలకు తగిన ప్లేయింగ్ లెవన్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగక తప్పని పరిస్థితి నెలకొంది.