Who is Shamar Joseph: షమార్ జోసెఫ్(Shamar Joseph)... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఈ విండీస్ సీమర్ నిప్పులు చెరిగే బంతులకు బౌలింగ్ దిగ్గజాలు సైతం సలాం చేస్తున్నారు. కంగారులను వారి గడ్డపైనే గడగడలాడించి.. విండీస్‌కు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత చారిత్రక విజయాన్ని అందించాడు. గబ్బాలో అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రకు నాంది పలికాడు. రెండో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి, 8 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించాడు. ఈ చారిత్రాత్మక గెలుపుతో కరేబియన్ ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయాన్ని కళ్లారా చూసిన వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా ఏకంగా గ్రౌండ్ లోనే భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకున్నాడు. తాను ఆడుతున్న రెండో టెస్ట్ లోనే ఆసీస్ లాంటి మేటి జట్టును బెంబేలెత్తించి... నయా సంచలనంగా మారాడు. ఈ కరేబియన్ స్పీడ్ స్టర్ పై వరల్డ్ వైడ్ గా ప్రశంసల వర్షం కురుస్తోంది. 24 ఏళ్ల ఈ కుర్రాడి పోరాట పటిమకు క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. స్టార్క్ యార్కర్ బలంగా తాకి షమార్ కాలి బొటన వేలికి గాయమైంది. దీంతో మైదానాన్ని వీడిన అతను.. తర్వాతి రోజు జట్టు కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుని మైదానంలోకి వచ్చి తన జట్టుకు చరిత్రలో మర్చిపోలేని గెలుపును అందించాడు. టెస్టు క్రికెట్‌ను కాపాడే రక్షకుల్లో ఒకడిగా షమార్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అభివర్ణించాడు.
నేపథ్యం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...
గయానా దీవుల్లోని ఫోన్లు, ఇంటర్నెట్‌లు లేని ఓ పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టాడు షమార్. ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్లాలంటే పడవలే దిక్కు. తొలుత కట్టెలు కొట్టే పని చేసే షమార్... తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం పట్టణానికి వలస వెళ్లి ఓ నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా మారాడు. ఆ తర్వాత అతను సెక్యూరిటీ గార్డుగానూ పని చేశాడు. రెండేళ్ల ముందు వరకు అతను అదే పనిలోనే ఉన్నాడు. వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడిన రొమారియో షెఫర్డ్‌తో ఉన్న పరిచయం వల్ల అతను గయానా జట్టు కోచ్ దృష్టిలో పడ్డాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే సెలక్షన్ ట్రయల్స్‌కు వెళ్లాడు. అక్కడ ప్రతిభ చాటుకుని డివిజన్-1 క్రికెట్లో అవకాశం సంపాదించాడు. అక్కడ తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీశాడు. తర్వాత కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో నెట్‌బౌలర్‌గా ఛాన్స్ దక్కింది. అదే సమయంలో దిగ్గజ బౌలర్ ఆంబ్రోస్.. అతడి బౌలింగ్ చూసి మెచ్చుకున్నాడు. ఇంకో ఏడాదిలో నిన్ను గయానా జట్టులో చూడాలనుకుంటున్నానని అన్నాడు. ఆంబ్రోస్ చెప్పిన గడువులోపే షమార్.. 2023 ఫిబ్రవరిలో గయానా తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం అందుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో, అలాగే గత ఏడాది కరీబియన్ లీగ్‌లో నిలకడగా రాణించడంతో ఇటీవలే వెస్టిండీస్ జాతీయ జట్టులోకి ఎంపికైన షమార్.. ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి సిరీస్‌లోనే సంచలన ప్రదర్శన చేసి హీరోగా మారాడు.
లీగ్‌లవైపు షమార్ చూపు..
ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శనతో షమార్ వైపు టీ20 లీగులు అన్నీ అతడి కోసం పరుగులు పెడుతున్నాయి. గబ్బా మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League) లో ఆడటానికి సంతకం చేశాడు జోసెఫ్. షమార్ ఈ లీగ్ లో పెషావర్ జల్మీ జట్టుకు ఆడటానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఒకే ఒక్క మ్యాచ్ తో తన జీవితాన్నే మార్చుకున్నాడు షమర్ జోసెఫ్. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. ఐపీఎల్ తో పాటు మరి లీగుల్లో అతడు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సెక్యూరిటీ గార్డు నుంచి స్టార్ క్రికెటర్ గా తన జీవితాన్ని మార్చుకున్నాడు షమర్ జోసెఫ్.