Indian women's team: భారత మహిళల  జట్టు ఇటీవలే బంగ్లాదేశ్ టూర్ కోసం టీమ్ ను ప్రకటించింది. ఈ  జట్టులో ఓ పేరు అందర్నీ ఆకర్షించింది. 24 ఏండ్ల  కేరళ ఆల్ రౌండర్ మిన్ను మణికి టీమ్ లో చోటు దక్కింది. టీమిండియా టీ20 టీమ్ లో ఆమె  స్థానం సంపాదించుకుంది. కేరళ నుంచి ఒక  క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఇంతకుమించిన మరో విశేషం ఏమిటంటే మిన్ను మణి అక్కడి  ‘కురిచియ’ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి.  పొలాలల్లో  క్రికెట్ ఆట నేర్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణాన్ని ఓసారి చూద్దాం. 


అమ్మానాన్నలు రైతు కూలీలు..


24 ఏండ్ల మిన్ను మణి.. కేరళలోని వయనాడ్ జిల్లా  మనంతవడి (చోయిమూల)కి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి  మణి సి.కె స్థానికంగా ఉండే పొలాల్లో దినసరి కూలీ. తల్లి వసంతదీ అదే బాట. పదేండ్ల వయసులోనే మిన్ను మణి  చోయిమూలలో ఉన్న అబ్బాయిలతో స్థానికంగా ఉండే పొలాల్లోనే  క్రికెట్ ఆడటం నేర్చుకుంది. అప్పుడేదో సరదాకి ఆడిన ఆటే ఆమె కెరీర్ అవుతుందని మిన్ను ఊహించలేదు.  8వ తరగతి చదువుతుండగా   ఆమె ఇడప్పడిలోని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవడంతో  క్రికెట్ పట్ల ఆమె ఆలోచనలు మారిపోయాయి. అప్పట్నుంచే ఆమె గేమ్ ను  సీరియస్ గా తీసుకోవడమే గాక పూర్తి  దృష్టి నిలిపింది. 


దేశవాళీలో టాప్.. 


ఫుట్బాల్, అథ్లెటిక్స్ కు ఉన్న ప్రాధాన్యత కేరళలో క్రికెట్ కు ఉండదు.  కానీ మిన్ను మాత్రం ఆ ఆటనే తన కెరీర్ గా ఎంచుకుంది. అండర్ - 16, 19 స్థాయిలలో   కేరళ తరఫున మెరిసింది.  దీంతో ఆమె స్టేట్ టీమ్ లో భాగమైంది.  16 ఏండ్లకే ఆమె స్టేట్ టీమ్ కు సెలక్ట్ కావడం విశేషం. గడిచిన దశాబ్దికాలంగా మిన్ను కేరళ తరఫున పలు విభాగాలలో మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నది.  లాస్ట్ సీజన్ లో ఉమెన్స్ ఆలిండియా  వన్డే టోర్నమెంట్ లో మిన్ను.. 8 మ్యాచ్ లలో 246 పరుగులు చేయడమే గాక బౌలింగ్ (ఆఫ్ స్పిన్నర్) లో 12 వికెట్లు కూడా పడగొట్టింది. దీంతో ఆమెకు ఇండియా ‘ఎ’, ‘బి’ టీమ్ లో కూడా ఛాన్స్ దక్కింది.  


 






ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో.. 


ఈ ఏడాది ముంబై వేదికగా ముగిసిన ఉమెన్స్  ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో కూడా మిన్ను భాగమైంది.  డబ్ల్యూపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మిన్నూను  రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కేరళ తరఫున వేలంలో పాల్గొన్న తొలి క్రికెటర్ గా ఆమె రికార్డులకెక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను వేలంలో దక్కించుకున్నా తుది జట్టులో మాత్రం  తగినన్ని అవకాశాలు  ఇవ్వలేదు. మూడు మ్యాచ్ లలో మాత్రమే ఆడిన ఆమె.. ఒక్క మ్యాచ్ లోనే బ్యాటింగ్ చేసింది. దీంతో ఆమె ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాకుండా పోయింది.  


టీమిండియాలోకి.. 


డబ్ల్యూపీఎల్ లో అవకాశాలు రాకున్నా  దేశవాళీలో రాణిస్తున్న ఆమె ప్రతిభను   టీమిండియా సెలక్టర్లు గుర్తించారు. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరుగబోయే మూడు టీ20ల సిరీస్ కు మిన్నును ఎంపిక చేశారు. మరి మిన్నుకు తుది జట్టులో చోటు దక్కుతుందా..? దక్కితే ఆమె ఎలా ఆడుతుందనేది  కేరళతో పాటు యావత్ భారతావనిలోని గిరిజనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మిన్ను మణి మెరిస్తే  ఆమె చాలామందికి  ఆదర్శంగా నిలవడం ఖాయం.. ఈనెల 9, 11, 13 తేదీలలో భారత్ - బంగ్లాల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. 


 






బంగ్లాదేశ్ తో టీ20లకు భారత జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, దేవికా, ఉమ, అమన్ జ్యోత్, సబ్బినేని మేఘన,  పూజా వస్త్రకార్, మేఘనా సింగ్, అంజలి, మోనికా, రాశి, అనూష, మిన్ను మణి 









Join Us on Telegram: https://t.me/abpdesamofficial