Ashes Series 2023: యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఇటీవలే ముగిసిన లార్డ్స్ టెస్టులో కంగారూలు గెలిచినా గెలిచిన తీరు మాత్రం వివాదాస్పదమవుతున్నది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ అంశంపై ఇరు దేశాల మాజీ క్రికెటర్లే గాక సాక్షాత్తూ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్రధానులు కూడా స్పందించారు. ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్ అయితే ఆసీస్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు.
క్షమాపణలు చెప్పాలి : బాయ్కాట్
లార్డ్స్ టెస్టులో ఆసీస్ విజయంపై బాయ్కాట్ టెలిగ్రాఫ్ కు రాసిన వ్యాసంలో ‘ఎలాగైనా మ్యాచ్ ను గెలవాలనుకునేవారికి క్రికెట్ సూట్ కాదు. మాకు నిజాయితీగా క్రికెట్ ఆడేవాళ్లు కావాలి. క్రికెట్ లో ప్రమాణాలను పెంచాలి. ఒక బ్యాటర్ పరుగు తీయడానికి ప్రయత్నించనప్పుడు నిబంధన పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం దేనికి..? ఇదేం మన్కడ్ లాంటి పరిస్థితి కాదు. జానీ (బెయిర్ స్టో) విషయంలో ఇలా జరుగలేదు. అతడు పరుగు తీయలేదు..
ఇప్పటికైనా మించిపోయింది లేదు. జానీ విషయంలో మీరు (ఆస్ట్రేలియా) చేసింది తప్పని బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలా అయితేనే ఆట పట్ల గౌరవం పెరుగుతుంది. ఈ టీమ్స్ బ్రిలియంట్ క్రికెట్ ఆడాయి. క్రీడా స్ఫూర్తిని కూడా ఘనంగా చాటాయన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. లేకుంటే మాత్రం అది ఆటకు తీరని నష్టం చేస్తుంది.. మనందరం తప్పులు చేస్తాం. కానీ వాటిని ఎలా సరిదిద్దుకుంటున్నామనేదే ముఖ్యం. రాబోయే రోజుల్లో అయినా ఆస్ట్రేలియన్లు తమ తప్పును సరిదిద్దుకుంటారో లేదో చూద్దాం..’ అని వ్యాసంలో పేర్కొన్నాడు.
ఇలాంటి గెలుపు మాకొద్దు.. రిషి సునక్
బెయిర్ స్టో రనౌట్ వివాదంపై యూకే ప్రధాని రిషి సునక్ స్పందించారు. ఆయన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వాదనతో ఏకీభవించినట్టు సునక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘ప్రధాన మంత్రి బెన్ స్టోక్స్ వాదనతో ఏకీభవించారు. ఆసీస్ చేసిన చర్యలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు’అని ఆయన ప్రతినిధి చెప్పారు. లార్డ్స్ టెస్టు ముగిశాక బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ఇలా తొండి ఆటలు ఆడి గెలిచే గెలుపు తమకొద్దని, ఒకవేళ అలాంటి పొజిషన్ లో తాము ఉంటే ఆ ఔట్ కు ప్రయత్నించేవాళ్లం కాదని వ్యాఖ్యానించాడు.
ఆసీస్ ప్రధాని ప్రశంసలు..
ఆస్ట్రేలియా విజయంపై ఇంగ్లాండ్ మాజీలు, ఆ జట్టు అభిమానులు విమర్శలకు దిగుతున్న వేళ ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ స్పందించారు. ఆసీస్ ను టార్గెట్ చేస్తూ ‘సేమ్ ఓల్డ్ ఆసీస్’ అంటూ ట్రోల్స్ కు దిగుతున్నారు. దీనిపై ట్విటర్ వేదికగా అల్బనీస్ స్పందిస్తూ.. ‘యాషెస్ సిరీస్ లో మన పురుషుల, మహిళల క్రికెట్ టీమ్స్ సాధిస్తున్న విజయాల పట్ల నేను గర్విస్తున్నా. సేమ్ ఓల్డ్ ఆసీస్ - ఎప్పటికీ గెలుస్తుంది. అలీస్సా హీలి, పాట్ కమిన్స్ లు సారథ్యం వహిస్తున్న ఆసీస్ టీమ్స్ కు ఆస్ట్రేలియా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. వారికి ఘన స్వాగతం చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.