AB De villiers: ఉన్నచోటు నుంచి కాలు కదపకుండా మైదానం నలువైపులా బంతిని పంపించగల సత్తా ఉన్న అతి కొద్ది మంది క్రికెటర్లలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఒకడు. ఈ సఫారీ మాజీ క్రికెటర్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2021 ఐపీఎల్ తర్వాత ఈ లీగ్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఏబీడీ.. కామెంటేటర్ గా సందడి చేశాడు. అతడు మళ్లీ ఐపీఎల్ ఆడతాడా..? ఐపీఎల్ క- 2024 సీజన్ లో ఏబీని చూడొచ్చా..? దీనిపై ‘మిస్టర్ 360’తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ - 16లో ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ‘ఇంపాక్ట్ ప్లేయర్’.ఈ నిబంధన ద్వారా చాలామట్టుకు టీమ్స్ తమకు అవసరమున్న విధంగా బౌలర్, బ్యాటర్ ను ఆడించాయి. పలువురు వెటరన్ క్రికెటర్లు, వయసు అయిపోయిన వాళ్లు కూడా దీనిని ఉపయోగించుకుని వాళ్ల కెరీర్ ను పెంచుకుంటున్నారు. ఐపీఎల్ - 17లో కూడా ఈ రూల్ తోనే ఏబీడీ ఆడనున్నాడా..? అన్న ప్రశ్నకు డివిలియర్స్ సమాధానమిచ్చాడు.
జియో సినిమాలో ప్రముఖ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కూడా ఓ చర్చా కార్యక్రమంలో డివిలియర్స్ ను ఇదే ప్రశ్న అడిగాడు. దానికి డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘నేను ఇంకా క్రికెట్ ఆడగలను. కానీ గతంలో మాదిరిగా వేగంగా ఆడకపోవచ్చు. నా చిన్నతనం నుంచే నేను ఎప్పుడు మ్యాచ్ ఆడినా నా బెస్ట్ ఇవ్వాలనుకునేవాడిని. ఒకవేళ ఇప్పుడు నేను తిరిగి వచ్చినా నాలోని అత్యుత్తమ ఆటనే ఆడాలని ప్రయత్నిస్తా. ఇప్పుడు నేను తిరిగి బ్యాట్ పట్టుకుంటే నా సహచర ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లతో పోటీ పడేలాగా ఆడగలగాలి. కానీ గడిచిన నాలుగేండ్లలో నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అదే అసలు సమస్య. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో ఐపీఎల్ లో చాలామంది క్రికెటర్లు తమ కెరీర్ స్పాన్ ను పెంచుకుంటున్నారు...
నా వరకైతే నేను ఎప్పుడూ అలా చేయను. ఏదో రెండు, మూడు నెలలు క్రికెట్ ఆడేసి తర్వాత ఏడాదంతా ఖాళీగా ఉండటం నావల్ల కాదు. మూడు నెలల క్రికెట్ ఆడి నేను వరల్డ్ బెస్ట్ బ్యాటర్ ను అనిపించుకోవడం కూడా సరికాదు. నేను ఇప్పటికీ నా బెస్ట్ ఆడగలను. కానీ నేను అలా చేయాలనుకోవడం లేదు..’అని స్పష్టంగా చెప్పాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో ఆడే అవకాశం ఉన్నా తాను మాత్రం ఏదో ఐపీఎల్, ఇతర లీగ్స్ లో ఆడి బెస్ట్ బ్యాటర్ అనిపించాలనుకోవాలనే కోరిక తనకు లేదని డివిలియర్స్ స్పష్టంగా వివరించాడు. కాగా తన సుదీర్ఘ కెరీర్ లో 114 టెస్టు మ్యాచ్ లు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్ లు ఆడిన ఏబీడీ.. ఐపీఎల్ లో 2011 నుంచి 2021 దాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కు ఆడాడు. ఐపీఎల్ లో కోహ్లీ - డివిలియర్స్ కలిసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.