Ashes 2023: ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను, బజ్ బాల్ ఆటతో టెస్టులను కొత్త పుంతలు తొక్కిస్తున్న అతడి నాయకత్వ పటిమపై  ఇన్నాళ్లు ఆహా ఓహో అని పొగిడినవాళ్లే  ఇప్పుడు అతడి సారథ్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు.  యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో వరుసగా రెండు  టెస్టులను ఓడిన ఇంగ్లాండ్.. లార్డ్స్ లో ముగిసిన రెండో టెస్టులో  జానీ బెయిర్ స్టో వివాదాస్పద రనౌట్ వివాదంతో కాస్త సానుభూతి  సంపాదించుకున్నా ఆస్ట్రేలియా మీడియా మాత్రం ఇంగ్లాండ్ సారథిని టార్గెట్ చేసింది. 


‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక  బెన్ స్టోక్స్ మార్ఫింగ్ ఇమేజ్ ను  ప్రచురించడం వివాదాస్పదమైంది.  సుమారు రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ పత్రిక.. జానీ బెయిర్ స్టో రనౌట్ తర్వాత  ఇంగ్లాండ్ కెప్టెన్ తో పాటు మాజీ క్రికెట్లు, ఇంగ్లీష్ మీడియా దాని గురించి ‘క్రీడా స్ఫూర్తి’ లెక్చర్లు ఇవ్వడానికి సెటైరికల్ గా స్పందించింది.  ఓ పసిబాలుడు నోటిలో పాలపీక  పట్టుకుని తన ముందు ఒకవైపుగా యాషెస్ ను  కిందపడేసి మరోవైపు  బాల్ ను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఫోటోను ప్రచురించింది.   ఆ పాల పీకను నోట్లో పెట్టుకున్న ముఖాన్ని  బెన్ స్టోక్స్ గా మార్ఫింగ్ చేసింది. ఈ ఫోటోకు  ‘క్రై బేబీస్’ అని  ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. నిబంధనల ప్రకారమే ఆసీస్ ఆడినా ఇంగ్లాండ్ మాత్రం చీటింగ్ ను   కొత్త లెవల్ కు తీసుకొస్తున్నారని అందులో రాసుకొచ్చింది.  


 






ట్విటర్ లో కొందరు వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రికను షేర్ చేశారు. ఇది కాస్తా   స్టోక్స్ వద్దకూ చేరింది. దీనిపై స్టోక్స్  స్పందించాడు. ‘కచ్చితంగా అది నేనైతే కాదు. నేనెప్పుడు కొత్త బాల్ తో బౌలింగ్ చేశాను’అని  కౌంటర్ ఇచ్చాడు.  బెన్ స్టోక్స్  ట్వీట్ నెట్టింట వైరల్ అవుతున్నది. 


కాగా లార్డ్స్ టెస్టులో భాగంగా ఐదో రోజు ఆటలో కామెరూన్ గ్రీన్ వేసిన 53వ ఓవర్లో బెయిర్ స్టో.. కామెరూన్ గ్రీన్ త్రోకు రనౌట్ అవడం వివాదాస్పదమైంది.  నిబంధనల  ప్రకారం అది అవుటేనని ఆసీస్ వాదిస్తున్నా.. ‘క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’ అని  ఇంగ్లాండ్  గొంతుచించుకుంటున్నది.   మ్యాచ్ ముగిశాక బెన్ స్టోక్స్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఇలాంటి ఛాన్స్ తమకు వస్తే మాత్రం తాము   ఆ అప్పీల్ ను వెనక్కి తీసుకుంటామని,  అలా గెలిచే గెలుపు తమకు అక్కర్లేదని వ్యాఖ్యానించాడు. అయితే  ఆసీస్ సారథి  పాట్ కమిన్స్ మాత్రం  తాము  చేసింది నిబంధనలకు లోబడే ఉందని.. అందులో రిగ్రీట్ అవడానికేమీ లేదని బదులిచ్చాడు. 


 









Join Us on Telegram: https://t.me/abpdesamofficial