Indian Womens Cricket Team Coach: గతేడాది డిసెంబర్ నుంచి హెడ్ కోచ్ లేక బ్యాటింగ్ కోచ్ తోనే నెగ్గుకొస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు గాను దేశవాళీ దిగ్గజం అమోల్ ముజుందార్ సిద్ధమయ్యాడు. త్వరలోనే అతడు హర్మన్ ప్రీత్ కౌర్ సేను హెడ్ కోచ్ గా రానున్నాడు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, రేపో మాపో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. రెండేండ్ల కాలానికి గాను అతడు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.
సోమవారం ముంబైలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ముందు ముజుందార్ సుమారు 90 నిమిషాల ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. ముజుందార్ తో పాటు టీమిండియా హెడ్ కోచ్ పదవికి పోటీ పడుతున్న డర్హమ్ (ఇంగ్లాండ్) మాజీ కోచ్ జాన్ లూయిస్, భారత జట్టుకు గతంలో కోచ్ గా పనిచేసిన తుషార్ అరోథ్ కూడా ప్రజంటేషన్ ఇచ్చారు. కానీ సీఏసీ మాత్రం ముజుందార్ ఇచ్చిన ప్రజంటేషన్ పై సీఏసీ సభ్యులు అశోక్ మల్హోత్ర, జతిన్ పరంజ్పె, సులక్షణ నాయక్ లు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
త్వరలోనే నియామకం..
ముజుందార్ తో పాటు మరో ఇద్దరు కూడా ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నా ముజుందార్ వైపే సీఈసీ, బీసీసీఐ మొగ్గు ఉన్నట్టు తెలుస్తున్నది. అదీగాక టీమిండియాను విజయాల బాట పట్టించడం.. ఐసీసీ టోర్నీలలో భారత్ కు ట్రోఫీని అందించడం.. ఆటగాళ్ల ఫిట్నెస్ వంటి విషయాలలో ముజుందార్ స్పష్టమైన ప్లానింగ్ తో ఉన్నాడట. అదీగాక అతడు గతంలో ముంబై రంజీ టీమ్ ను నడిపించిన తీరు కూడా ఆకట్టుకునేవిధంగానే ఉంది. ఐపీఎల్ లో కూడా ముజుందార్.. రాజస్తాన్ రాయల్స్ కు కోచ్ గా వ్యవహరించాడు. 2019లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించినప్పుడు సఫారీలకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కూడా పనిచేశాడు. రాబోయే రెండు మూడు రోజుల్లోనే అతడిని హెడ్ కోచ్ గా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఎవరీ ముజుందార్..?
మహారాష్ట్రకు చెందిన అమోల్ అనిల్ ముజుందార్.. జాతీయ జట్టులో మెరవకపోయినా దేశవాళీలో మాత్రం గుర్తింపుపొందాడు. 1993లోనే రంజీలకు ఎంట్రీ ఇచ్చిన (ముంబై టీమ్ కు ఆడాడు) ముజుందార్.. 2006 నుంచి 2009 దాకా ముంబైకి సారథిగా కూడా పనిచేశాడు. ముజుందార్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 171 మ్యాచ్ లు ఆడి 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. క్రికెట్ నుంచి తప్పుకున్నాక ఆయన కోచింగ్ వైపునకు మళ్లాడు.
బంగ్లాదేశ్ సిరీస్ తోనే..
ముజుందార్ టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైతే అతడి తొలి టూర్ ఈనెలలోనే ఉంది. జులై 9 నుంచి 22 వరకు భారత జట్టు బంగ్లాదేశ్ లో మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడనుంది. ముజుందార్ కు ఇదే తొలి పరీక్ష కానుంది.
అసలు కథ అప్పుడే..
బంగ్లాదేశ్ తర్వాత భారత జట్టు ఆసియా క్రీడల్లో (సెప్టెంబర్ - అక్టోబర్ లో చైనా వేదికగా) పాల్గొననుంది. ఆ తర్వాత కూడా పలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాల్సి ఉంది. కానీ ముజుందార్ కు అసలు పరీక్ష వచ్చే ఏడాది ఎదురవనుంది. 2024లో బంగ్లాదేశ్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ముజుందార్ కు ఇది అత్యంత కీలకం. భారత మహిళల జట్టుకు ఇంతవరకూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లో ఆసీస్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.