DEXA test: ఆదివారం ముంబయిలో బీసీసీఐ సమావేశం జరిగింది. బీసీసీఐ కార్యదర్శి జైషా అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఇటీవల భారత జట్టు పనితీరు, ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైంది యోయో టెస్ట్, డెక్సా టెస్ట్.
ఇంతకుముందు జాతీయ జట్టులో ఎంపిక కోసం ఆటగాళ్లకు యో యో ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించేవారు. అయితే కొన్నాళ్ల క్రితం నుంచి అది మరుగున పడిపోయింది. ఇటీవల ప్లేయర్లు తరచూ గాయపడటంతో మళ్లీ ఇప్పుడు యో యో టెస్టును ప్రవేశపెట్టాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. దాంతో పాటు డెక్సా టెస్టును కంపల్సరీ చేసింది. యో యో టెస్ట్ అంటే మనకు తెలిసిందే. మరి డెక్సా టెస్ట్ అంటే ఏంటి? అది ఎవరికి నిర్వహిస్తారు? దానివలన ప్రయోజనం ఏంటి? అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డెక్సా టెస్ట్ అంటే ఏంటి?
డెక్సా (డ్యూయల్ ఎనర్జీ ఎక్స్ రే అబ్సార్ట్పియోమెట్రీ) అనేది.. స్పెక్ట్రల్ ఇమేజింగ్ అనే ప్రత్యేక సాంకేతికత ద్వారా ఒక వ్యక్తి ఎముక ఖనిజ సాంద్రతను నిర్ణయించే శాస్త్రీయ పద్ధతి. ఇందులో వివిధ శక్తి స్థాయిలలో రెండు ఎక్స్ రే కిరణాలను వ్యక్తి ఎముక వైపు మళ్లిస్తారు. అది అతని ఎముక సాంద్రత, ఎముక యొక్త ఖనిజ సాంద్రతతో కూడిన చార్ట్ ను వెల్లడిస్తుంది.
ఆటగాళ్లకు డెక్సా టెస్ట్ ఎందుకు ముఖ్యమైనది?
సాధారణ మనుషులతో పోలిస్తే క్రీడాకారులు మెరుగైన ఎముక ఖనిజ సాంద్రత కలిగి ఉంటారు. అయితే ఆటగాళ్లు గాయపడినప్పుడు వారి ఎముకల బలం, సాంద్రత దెబ్బతింటుంది. వారు పునరావాసం పొంది కోలుకుని మళ్లీ ఫిట్ గా మారతారు. అయినప్పటికీ ఈ సాంద్రత మునుపటిలా ఉండదు. అందువల్ల కోలుకుని వచ్చిన ఆటగాడు తన మొదటి ఆటలో మళ్లీ గాయపడే ప్రమాదం ఉంది. డెక్సా టెస్ట్ దీనిని నివారిస్తుంది. గాయపడి మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన క్రీడాకారుడు తాజా గాయం బారిన పడకుండా ఈ టెస్ట్ ముందు జాగ్రత్త చర్యగా పనిచేస్తుంది. గాయపడి తిరిగొచ్చిన వారికి ఈ టెస్ట్ నిర్వహిస్తే అతని ఎముక సాంద్రత ఎలా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి అతనిని జట్టులోకి తీసుకుంటారు.
సమావేశంలో బీసీసీఐ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు
ఇకపై జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి.
యో యో టెస్ట్ పాస్ అవ్వాలి.
వన్డే, టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగింపు.
20 మందితో వన్డే ప్రపంచకప్ కోసం కోర్ జట్టు ఏర్పాటు.
టీ20 కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగింపు.