T20 WORLD CUP 2024 West Indies Team:  అమెరికాతో కలిసి ఈసారి టీ 20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తోన్న వెస్టిండీస్ ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన తమ స్క్వాడ్‌ని ప్రకటించింది. ఆల్ రౌండర్ల మయంగా ఉన్న ఈ టీమ్‌కు  రోవ్‌మాన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.  పుష్కలంగా పించ్ హిట్టర్లు, ఆల్ రౌండర్లు ఉన్న ఈ జట్టును చూసిన వారంతా అరివీర భయంకర విండీస్ అని అంటున్నారు. ప్రత్యర్థి జట్లు ఈ టీమ్ ముందు నిలిచేనే అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

వాళ్లకి ఛాన్స్.. 

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆరంగేట్రం చేసి ఆకట్టుకున్న షమర్ జోసఫ్‌కి తొలిసారిగా తమ దేశం తరఫున టీ 20ల్లో ఆడేందుకూ ఛాన్స్ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ వేదికగా ఈ ఫార్మాట్‌లో ఈ క్రికెటర్ ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇక ఐపీఎల్ లో రాజస్థాన ‌రాయల్స్ జట్టులో ఆడుతూ మంచి ఫినిషర్‌గా రాణిస్తోన్న హెట్‌మెయర్‌కు కూడా ఈసారి ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌ను మిస్ అయిన అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. 

వీళ్లను డ్రాప్

జట్టుకు ఓపెనర్ కంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అవసరం ఎక్కువ ఉందనే కారణంతో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడిన జట్టులో ఉన్న కైల్ మేయర్స్‌ని ఈ సారి డ్రాప్ చేశారు. అలాగే పేసర్ ఒషేన్ థామస్‌కి సైతం తుది జట్టులో చోటివ్వలేదు. 

బ్యాటింగ్ లైనప్ చూస్తేనే భయం

ఈ టోర్నీలో జాన్సన్ ఛార్లెస్, బ్రాండన్ కింగ్ , షాయ్ హోప్ లను టాప్ ఆర్డర్ బాట్స్‌మన్‌గా పంపేందుకు చూస్తుండగా... ఆ తరువాత బ్యాట్‌తో విధ్వంసం సృష్టించేందుకు పూరన్, రస్సెల్, హెట్​మెయిర్, పావెల్, జాసన్ హోల్డర్, రూథర్‌ఫర్డ్, రొమారియో షఫర్డ్ వంటి లెక్కకు మించిన పించ్ హిట్టర్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. వీళ్లని చూసి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. వీళ్లు గనుక బ్యాట్ ఝుళిపిస్తే బంతి బౌండరీ దాటడం ఖాయం. 

బౌలింగ్ ఇలా.. 

ఇక బౌలింగ్ విషయానికొస్తే..  అకీల్ హొస్సేన్, గుడకేష్ మోతీ ద్వయం స్పిన్ బౌలింగ్‌కు అందుబాటులో ఉండగా.. పేస్ బౌలింగ్‌ను వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్‌ సహాయంతో ముందుకు తీసుకెళ్లనున్నాడు.
  
 


 

ఇదీ కరీబియన్ జట్టు.. 


రోవ్‌మాన్ పావెల్(కెప్టెన్),  ఆండ్రూ రస్సెల్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్​మెయిర్, అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్, షాయ్ హోప్, అకీల్ హొస్సేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్


 

క్రికెట్ రాక్షసులు.. 

క్రికెట్ రాక్షసుల్నందర్నీ తీసుకొచ్చి టీమ్‌లో పెట్టుకున్నారేంటని ఈ టీమ్ ని చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీళ్లను తట్టుకొని నిలబడటం ఏ టీమ్ బౌలర్లకైనా అసాధ్యమేనని.. కప్పు కొట్టకుండా కరీబియన్ జట్టును ఆపడం కష్టమేనంటున్నారు. బౌలింగ్ కంటే బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోన్న ఈ జట్టును సొంత గడ్డపై నిలువరించడం దాదాపు అసాధ్యమేనన్న వాదన వినపడుతోంది. బౌలింగ్లో సైతం రాణిస్తే విండీస్ జట్టుకు తిరుగుండదని చెబుతున్నారు. రిటైర్ మెంట్ కారణంగా సునీల్ నరైన్ లాంటి వరల్డ్  క్లాస్ స్పిన్నర్ కమ్  పించ్ హిట్టర్‌ను జట్టులో చూడలేకపోయామని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు.