MS Dhoni Gift To 103 year Old Man- ‘‘నేను ముసలోణ్ని కాదు.. సీనియర్ యువకుణ్ని.. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నాకు క్రికెట్ కావాలి. దిల్లీలో జరిగే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు నడిచి వెళ్లిపోతా’’ అంటూ ఉత్సాహంగా చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఫ్యాన్ ఎస్. రాందాస్ అనే 103 ఏళ్ల వృద్ధుడి మాటలకు సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ఫిదా అయ్యాడు. రాందాస్ పేరు ముద్రించి ఉన్న ఓ కస్టమైజ్డ్ జెర్సీపై ‘‘నీ సపోర్ట్‌కు థ్యాంక్స్ తాతా’’ అంటూ సంతకం చేసి అతనికి గిఫ్ట్‌గా పంపించాడు. హార్ట్ టచింగ్ గా ఉన్న ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అఫీషియల్ ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
సీఎస్కేను తన కెప్టెన్సీలో అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోనీ ఈ సీజన్‌తో ఐపీఎల్ నుంచి కూడా రిటైరవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో 103 ఏళ్ల సీఎస్‌కే ఫ్యాన్ రాందాస్ విషయంలో ధోనీ వ్యవహరించిన తీరుకు ఆయన ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు జేజేలు పలుకుతున్నారు.
ధోనీ కోసమే స్టేడియం పసుపుమయం అవుతుంది..
మ్యాచ్ ఏ నగరంలో జరిగినా.. అది ఏ జట్టుకు హోం గ్రౌండ్ అయినా.. ధోనీ ఉన్న సీఎస్‌కే మ్యాచ్ అంటే ఆ స్టేడియంలో ఎక్కువగా కనిపించే వర్ణం పసుపే. చెన్నై అభిమానులే కాదు.. ఏ జట్టు అభిమానులైనా తలా మీద అభిమానంతో ధరించేది పసుపు జెర్సీనే.. స్టేడియంలో వేచి చూసేది ధోనీ కోసమే. ధోనీ వస్తున్నాడంటే ‘తలా.. తలా..’ అనే నినాదంతో స్టేడియం మార్మోగిపోతుంది. ఆయన కోసం ఫ్యాన్స్ మ్యాచ్ ఎక్కడ జరిగినా వెళ్లిపోతారంటే అతిశయోక్తి కాదు. ఇంత అభిమానాన్ని సొంతం చేసుకున్న ధోనీకి ఐపీఎల్‌లో ఇదే చివరి సీజన్ కావడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది.
సిక్సర్లతో రికార్డులకెక్కాడు..
పెద్దగా బ్యాటింగ్‌కు అవకాశం రాకపోయినా.. ప్రస్తుత ఐపీఎల్‌లో ఆయన ఆటతీరు అద్భుతమనే చెప్పాలి. ఆయన ఈ సీజన్‌లో ఎదుర్కొంది మొత్తం కలిపి 48 బంతులే.. అయినా తన ఆటతీరుతో అభిమానులను ఉర్రూతలూగించి 229 స్టైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి మూడు వరుస బంతులకు మూడు సిక్సర్లు బాది సీజన్‌లోని తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ధోనీ ఈ ఫీట్ సాధించినందుకు సైతం రికార్డుల్లో కెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో ఇంత విధ్వంసకర ఫీట్ సాధించిన బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు.
చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలిలా..
ఆడిన పది మ్యాచ్‌లలో అయిదింట గెలిచి అయిదింట ఓడిన చెన్నై ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ పది పాయింట్లు సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే వాటిలో మూడు మ్యాచ్‌లు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. అప్పడే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో చోటొచ్చే అవకాశముంది. కానీ ఇతర టీంల ఫలితాలు అటూ ఇటూ అయితే ఆ బెర్తు పదిలం కాదు. అసలు ఇతర జట్ల ఆటతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ కావాలంటే మిగిలి ఉన్న అన్ని మ్యాచ్‌లలోనూ చెన్నై గెలవాలి. 18 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్తు పక్కా ఆ టీమ్ సొంతమవుతుంది.