International Cricket Council: వెస్టిండీస్ మాజీ క్రికెటర్, విధ్వంసకర బ్యాటర్‌ మార్లోన్ శామ్యూల్స్‌(Marlon Samuels)కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC) ఊహించని షాక్ ఇచ్చింది. అన్ని ఫార్మాట్ల నుంచి శామ్యూల్స్‌ను ఆరేళ్ల పాటు నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ డాషింగ్‌ బ్యాటర్‌పై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తూ ICC నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నియ‌మాల‌ను ఉల్లంఘించిన కేసులో స్వతంత్ర అవినీతి నిరోధ‌క న్యాయస్థానం  శామ్యూల్స్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దాంతో ఈ ఆరేళ్ల పాటు లీగ్ టోర్నీల‌తో పాటు అన్నిర‌కాల‌ క్రికెట్‌కు ఈ విండీస్ ఆట‌గాడు దూరం కానున్నాడు. ఈ నిషేధం ఈ నవంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఇదివరకే అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన వ్యవహారంలో మార్లోన్‌ శామ్యూల్స్‌ ఈ ఏడాది ఆగస్టులో దోషిగా తేలాడు. దీంతో తాజాగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐసీసీ హెచ్ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్‌కు చెందిన అలెక్స్ మార్షల్ వెల్లడించారు. 



అబుదాబి టీ10 లీగ్‌ ద్వారా పొందిన ప్రయోజనాలను వెల్లడించడంలో విఫలం కావడంతో బ్యాన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. విచారణాధికారికి సహకారం అందించలేదని ఐసీసీ అధికారికంగా ప్రకటన వెలువరించింది. అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన వ్యవహారంలో మార్లోన్‌ శామ్యూల్స్‌ ఈ ఏడాది ఆగస్టులో దోషిగా తేలాడు. శామ్యూల్స్‌పై 2021 సెప్టెంబ‌ర్‌లో అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రెండేళ్ల క్రితం ఈ ఆల్‌రౌండ‌ర్ త‌న‌కు వ‌స్తు, ధ‌న రూపంలో ముట్టిన కానుక‌ల గురించి అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు చెప్పలేదు. తాను బ‌స చేసిన హోట‌ల్ బిల్లు 750 అమెరికా డాల‌ర్లు అంటే రూ. 62,362కు సంబంధించిన పేప‌ర్‌ను దాచిపెట్టాడు. అంతేకాదు కేసు విచార‌ణలో అధికారుల‌కు స‌హ‌క‌రించ‌లేదు. దీంతో ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు  అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన శామ్యూల్స్‌పై 2021 సెప్టెంబరులో నాలుగు నేరాల కింద ఐసీసీ అభియోగాలు నమోదు చేసింది. స్వతంత్ర అవినీతి నిరోధక ట్రైబ్యునల్‌ విచారణలో తన వాదనలు వినిపించిన 42 ఏళ్ల శామ్యూల్స్‌.. చివరికి దోషిగా తేలాడు. శామ్యూల్స్‌పై ఆర్టికల్ 2.4.2, ఆర్టికల్ 2.4.3, ఆర్టికల్‌ 2.4.6, ఆర్టికల్ 2.4.7 ప్రకారం శిక్షను ఖరారు చేస్తున్నామని స్వతంత్ర అవినీతి నిరోధ‌క న్యాయస్థానం  తీర్పు వెలువరించింది.


మార్లోన్ శామ్యూల్స్‌ వెస్టిండీస్‌ గెలిచిన రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో సభ్యుడు. ఫైనల్స్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌లతో విండీస్‌ను గెలిపించాడు. అంతర్జాతీయంగా 300కిపైగా మ్యాచ్‌లను ఆడాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో వెస్టిండీస్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి 2020 నవంబర్‌లోనే వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత లీగ్‌లు మాత్రమే ఆడుతూ వచ్చాడు. దీంతో ఇప్పుడు ఐసీసీ విధించిన నిషేధం ప్రకారం ఆరేళ్లపాటు ఎలాంటి క్రికెట్‌ను ఆడే అవకాశం ఉండదు.


శామ్యూల్స్ 18 ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సమయంలో 300లకు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2012, 2016లో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. విండీస్‌ తరఫున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20ల్లో ఆడిన శామ్యూల్స్‌.. 11,134 పరుగులు చేసి, 152 వికెట్లు పడగొట్టాడు. 17 సెంచరీలు బాదాడు. 2020 నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.