TNPL 2025: అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ డిండిగల్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఒక మ్యాచ్ సందర్భంగా అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతన్ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన మహిళా అంపైర్ పై సీరియస్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన అశ్వినేనా అని అభిమానులు సైతం షాకవుతున్నారు..

స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఈ వీడియోను షేర్ చేసింది. అశ్విన్ అంపైర్ పై కోపంగా ఉన్నట్లు వీడియోలోలో స్పష్టంగా కనిపిస్తోంది, ఎందుకంటే అంపైర్ తనను ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చారు. అశ్విన్ సీరియస్ గా ఉన్న వీడియోపై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. అసలు అశ్విన్ కు అంత కోపం ఎందుకు వచ్చిందో ఇక్కడ తెలుసుకోండి. 

అశ్విన్ అంపైర్ పై ఎందుకు కోపగించుకున్నాడు?

 తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో డిండిగల్ డ్రాగన్స్, ఐడ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ మధ్య ఆదివారం నాడు మ్యాచ్ జరిగింది. గ్రూప్ స్టేజ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో అశ్విన్ ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే అశ్విన్ సాధారణంగా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడు, కానీ ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అతను 11 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ తాను ఔటైన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

అశ్విన్ ఈ బంతిని స్వీప్ చేయాలనుకున్నాడు, కానీ బంతి మిస్ అయి ప్యాడ్లకు తగిలింది. దాంతో అంపైర్ అశ్విన్ ను ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించారు. అశ్విన్ వెంటనే అంపైర్ దగ్గరకు వెళ్లి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అంపైర్ అతని మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు.