Wahab Riaz Retirement:


పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వహాబ్‌ రియాజ్‌ (Wahab Riaz retires) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. పాకిస్థాన్ తరఫున 15 ఏళ్ల కెరీర్‌ను ముగించాడు. అయితే ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో మాత్రం కొనసాగనున్నాడు. ఒకప్పుడు దాయాది దేశానికి అతడు కీలక పేసర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.


పాకిస్థాన్‌ తరఫున వహాబ్‌ రియాజ్‌ 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. చివరి సారిగా 2020లో దేశం తరఫున ఆడాడు. టెస్టుల్లో 34.50 సగటుతో 83 వికెట్లు, వన్డేల్లో 34.30 సగటుతో 120 వికెట్లు, టీ20ల్లో 28.55 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2023లో సీజన్లో అతడు పెషావర్‌ జల్మీకి ప్రాతినిధ్యం వహించాడు. రాజకీయాలతోనూ అతడికి అనుబంధం ఉంది. ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌ ప్రావిన్స్‌కు క్రీడామంత్రిగా ఎంపికయ్యాడు.


'అంతర్జాతీయ వేదికలో పాకిస్థాన్‌ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో గౌరవం. ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగిస్తున్నా. ఫ్రాంచైజీ క్రికెట్లో కొత్త సాహసాలు చేయబోతున్నందుకు ఆత్రుతగా ఉంది. లీగ్‌ క్రికెట్‌ ద్వారా అభిమానులను అలరిస్తాను. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో పోటీపడతాను' అని వహాబ్‌ రియాజ్‌ అన్నాడు.


వహాబ్‌ రియాజ్‌ 2008లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. జింబాబ్వేపై మొదటి మ్యాచ్‌ ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో అతడు టీమ్‌ఇండియాపై ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇక 2015 ప్రపంచకప్‌లో అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో షేన్‌ వాట్సన్‌కు చురకత్తుల్లాంటి బంతులు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా 2019 నుంచి అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఫోకస్‌ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేస్తున్నాడు.


Also Read: భారత్‌ vs ఐర్లాండ్‌ టీ20 సమరం - ఈ యాప్‌లో ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌!


'రెండేళ్ల నుంచి నా రిటైర్మెంట్‌ ప్రణాళికల గురించి మాట్లాడుతూనే ఉన్నాను. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ముందే చెప్పాను. సాధ్యమైనంత వరకు దేశానికి అత్యుత్తమంగా సేవ చేశాననే అనుకుంటున్నాను. ఇప్పటికైతే నాకు సంతృప్తిగానే ఉంది' అని వహాబ్‌ అన్నాడు.