India vs South Africa Test Match Updates:కింగ్ కోహ్లీ(Virat Kohli) తన ఖాతాలో మరో రికార్డు జమ చేసుకున్నాడు. ఇప్పటికే భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విరాట్... ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లోనూ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2019-2025 లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ 57 ఇన్నింగ్స్ లలో 2,101 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్ లలో 2,097 పరుగులు చేశాడు. కోహ్లీ, రోహిత్ శర్మ తరువాత 62 ఇన్నింగ్స్ లలో 1,769 పరుగులతో చెతేశ్వర్ పుజారా మూడో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత స్థానాల్లో అజింక్య రహానే 49 ఇన్నింగ్స్ లో 1,589 పరుగులు, రిషబ్ పంత్ 41 ఇన్నింగ్స్ లలో 1,575 పరుగులు చేశారు.
తొలి టెస్ట్‌లో పోరాడుతున్న టీమిండియా
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. డీన్ ఎల్గర్ అద్భుత పోరాటంతో ప్రొటీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన డీన్ ఎల్గర్ భారీ శతకం సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. సఫారీ జట్టు ఇప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతుకుముందు ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మరో 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ అద్భుత శతకం చేసి భారత్ కు గౌరవమైన స్కోర్ అందించాడు. టెయిలెండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగూ జోడిస్తూ.. టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. 164 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయిన తర్వాత బుమ్రా, సిరాజ్ లతో కలిసి రాహుల్ స్కోరును 245 పరుగుల వరకూ తీసుకెళ్ళాడు. కోహ్లి 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు.
సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన రాహుల్..
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ దెబ్బకి బుధవారం సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. రెండో రోజు ఉదయం 70 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్.. 137 బంతుల్లో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ 66వ ఓవర్‌లో గెరాల్డ్ కుట్జీపై మిడ్-వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు. రాహుల్ కేవలం 80 బంతుల్లో సిక్సర్ కొట్టి యాభైని పూర్తి చేశాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. రెండో రోజు 101 పరుగులు పూర్తి చేసిన చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ఆగిపోయింది. సెంచూరియన్‌లో రాహుల్‌కి ఇది వరుసగా రెండో సెంచరీ. భారత్ గత చివరి సిరీస్‌లో మూడంకెల మార్కును చేరుకున్నాడు. దీంతో ఒకే వేదికలో అధిక సెంచరీలు చేసిన మొదటి విదేశీ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.