ICC Declared Shot of the Century: రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) రికార్టుల పుస్తకంలో మరో అరుదైన ఘనత చేరింది. ఇప్పటికీ షేన్‌ వార్న్‌  వేసిన బంతిని బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ అని పిలిచేవాళ్లం. మరి షాట్‌ ఆఫ్‌ ది సెంచరీ(Shot Of The Century) ఏదీ... ఇప్పటివరకూ ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కానీ ఇప్పుడు ఆ ఘనత టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి సొంతమైంది. పాకిస్థాన్‌తో గత టీ 20 ప్రపంచకప్‌లో హరీస్‌ రవూఫ్‌(Haris Rauf) బౌలింగ్‌లో 19 ఓవర్‌ ఆయిదో బంతికి.. బాడీని బ్యాలెన్స్‌ చేస్తూ  లాంగాన్ మీదుగా కోహ్లీ కొట్టిన సిక్స్‌కు క్రికెట్ ప్రపంచం ఉర్రూత‌లూగింది. ఇప్పుడు ఇదే షాట్‌ను ఐసీసీ "షాట్ ఆఫ్ ది సెంచరీ" గా ప్రకటించింది. అంతే మరోసారి ఈ షాట్‌ సోషల్‌ మీడియాను దున్నేస్తోంది. 


 2022 టీ 20 ప్రపంచక‌ప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు 160 పరుగుల లక్ష్య చేధనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో విరాట్ ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకొచ్చాడు. ఇక ఎనిమిది బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో టీమిండియా నిలిచి ఓటమి దిశగా పయనిస్తోంది. అంటే దాదాపుగా బంతికి ఓ ఫోర్‌ కొడితే తప్ప భారత జట్టుకు విజయం దక్కదు. ఈ దశలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పరిగణించే హరీస్‌ రవూఫ్‌ 19 ఓవరల్‌ బౌలింగ్‌ చేసేందుకు వచ్చాడు. తొలి నాలుగు బంతులను కట్టుదిట్టంగానే వేశాడు. దీంతో టీమిండియా ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అక్కడున్నది ఛేదనలో తన రికార్డులను తానే తిరగరాసే విరాట్‌ కోహ్లీ. హరీస్‌ రవూఫ్‌ వేసిన 19 ఓవర్‌ అయిదో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ బాదేశాడు కోహ్లీ. ఈ షాట్‌ను క్రికెట్‌ అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోలేరు. అలాంటి షాట్‌ అది. లాంగాన్‌ మీదుగా బంతి గమనాన్ని అంచనా వేస్తూ కోహ్లీ కొట్టిన షాట్‌ అదిరిపోయింది. ఆ తర్వాత బంతిని కూడా సిక్సర్‌గా కోహ్లీ మలిచాడు. దీంతో టీమిండియా విజయ సమీకరణం చివరి ఓవర్లో 16 పరుగులుగా మారింది. దాన్ని తేలిగ్గా ఛేదించిన కోహ్లీ టీమిండియాకు మరచిపోలేని విజయాన్ని అందించాడు.  ఇటీవల క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీకి ఇప్పుడు షాట్‌ ఆఫ్‌ ది సెంచరీ గౌరవం కూడా దక్కింది. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ నిర్వహించింది. 


పదిహేనేళ్ల కెరియర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 49 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును సమం చేశాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌‌‌‌‌‌‌‌లో 79 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 49, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డు బ్రేక్ చేసేందుకు విరాట్‌ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 50 సెంచరీల రికార్డును ఈ ప్రపంచకప్‌‌‌‌లోనే కోహ్లీ సాధించే అవకాశం ఉంది.


కోహ్లీ క్రికెట్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు తిన్నా.. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. 2023లో కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఆరు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో తనదైన ఆటతో అదరగొడుతున్నాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 90 సగటుతో 550కిపైగా పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలతో పాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి.