టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ( Virat Kohli) పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరికి రికార్డులు గుర్తుకు వస్తాయి. క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరు పొందాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్న విరాట్ కోహ్లీ కొత్త ఏడాదిలో మరిన్ని రికార్డులను బద్దలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కనుచూపు మేరలో కొన్ని రికార్డులు ఉండడంతో అవన్నీ విరాట్ కోహ్లీ ఖాతాలో ఈ ఏడాది చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో కీలక రికార్డులో ఉండడం క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తిని కలిగిస్తోంది

 

రికార్డులు ఇవే..

 

విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు జాబితాలో కొన్ని ఉన్నాయి. వీటిలో వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించేందుకు విరాట్ కోహ్లీ కేవలం 152 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి ప్రస్తుతం ఉన్న ఫామ్ ను పరిశీలిస్తే రెండు మూడు వన్డేల్లోనే ఆ రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశం కనిపిస్తోంది. సచిన్ టెండూల్కర్ 350 మ్యాచుల్లో ఈ మైలురాయిని అందుకోగా.. విరాట్ కోహ్లీ మాత్రం 202 వన్డేల్లోనే ఈ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.

 

* టి20 క్రికెట్లో 12000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ 35 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14,562), షోయబ్ మాలిక్(12,993), కీరన్  పోలార్డ్ (12,390) ముందు వరుసలో ఉన్నారు. 

 

* టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు విరాట్ కోహ్లీ 544 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ టెండుల్కర్ 2535 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కోహ్లీ 544 పరుగులు చేస్తే ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ రికార్డును సులభంగానే అవకాశం కనిపిస్తోంది. 

 

* ఇంగ్లాండ్ జట్టుపై మరో అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. అదే అన్ని ఫార్మాట్ లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం. మరో 21 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లి రికార్డ్ సృష్టిస్తాడు. 

 

* న్యూజిలాండ్ జట్టుపై మరో సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఈ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ గా కోహ్లీ నిలువనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ, సచిన్ 9 సెంచరీలతో సమానంగా ఉన్నారు. ప్రస్తుతం కోహ్లి ఉన్న ఫామ్ చూస్తే ఈ రికార్డులను సులభంగానే చేరుకునే అవకాశం కనిపస్తోంది. 

విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ ప్రపంచానికే కాదు అసలు ఎవరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఈ రన్ మెషీన్ గురించి చాలా చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తే. రికార్డుల్లోకానీ... ఆటలో గానీ, సోషల్‌ మీడియా క్రేజ్‌లో గానీ, బ్రాండ్‌ల విషయంలో గానీ కోహ్లీకి సరితూగే ఆడగాడు దరిదాపుల్లో కూడా లేడు. ఇప్పటికే గూగుల్‌ (Google) పాతికేళ్ల చరిత్రలో అత్యధిక మంది శోధించిన క్రికెటర్‌గా టాప్‌లో నిలిచిన విరాట్‌ కోహ్లీ... మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. గతేడాది ఆసియా వ్యాప్తంగా వికిపీడియాలో నెటిజన్లు అత్యధికంగా చూసిన పేజీలలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచి తన ఫ్యాన్స్‌ బేస్‌ను ప్రపంచానికి చాటిచెప్పాడు.