సఫారీ గడ్డపై తొలి టెస్టు(First Test)లో ఘోర పరాజయం పాలైన టీమిండియా(Team India) మూడో తేదీ నుంచి రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. తొలి టెస్టులో బౌలర్లందరూ విఫలమైనా స్టార్‌ పేసర్‌ బుమ్రా మాత్రం అంచనాలను మించి రాణించి సత్తా చాటాడు. రెండో టెస్టులోనూ బుమ్రా రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ఈక్రమంలో ఈ స్పీడ్‌ స్టార్‌ అరుదైన రికార్డు ముందు నిలిచాడు. జనవరి 3 నుంచి మొదలుకాబోయే రెండో టెస్టులో బుమ్రా ఆరు వికెట్లు తీస్తే ఈ వేదికపై అత్యధిక వికెట్లు తీసిన యాక్టివ్‌ బౌలర్లలో జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు.


కేప్‌టౌన్‌లో బుమ్రా ఇప్పటివరకూ రెండు టెస్టులు ఆడి పది వికెట్లు పడగొట్టాడు. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లలో ఇంగ్లండ్‌ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌.. 16 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా రెండో టెస్టులో బుమ్రా ఏడు వికెట్లు పడగొడితే అతడు అండర్సన్‌ను అధిగమిస్తాడు.  ఇప్పుడు క్రికెట్‌ ఆడుతున్న వారిలో కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు జేమ్స్‌ అండర్సన్‌ మాత్రమే. ఈ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
 అంతేగాక ఏడు వికెట్లు తీస్తే ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 17 వికెట్ల రికార్డును సమం చేస్తాడు. ఓవరాల్‌గా కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్లలో ఇంగ్లండ్‌ బౌలర్‌ కొలిన్‌ బ్లిత్‌ 25 వికెట్లతో ముందువరుసలో ఉన్నాడు. భారత్‌ నుంచి కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. మాజీ పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ (12 వికెట్లు), అనిల్‌ కుంబ్లే (11) లు తొలి రెండు స్థానాలలో ఉన్నారు. కేప్‌టౌన్‌లో మూడు వికెట్లు పడగొట్టినా శ్రీనాథ్‌ 27 ఏళ్ల రికార్డు బద్దలవుతుంది. 2018లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటివరకూ 31 టెస్టులు ఆడి 132 వికెట్లు పడగొట్టాడు.
కోహ్లీ ముంగిట అరుదైన రికార్డులు
ఈ ఏడాది విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు జాబితాలో కొన్ని ఉన్నాయి. వీటిలో వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించేందుకు విరాట్ కోహ్లీ కేవలం 152 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి ప్రస్తుతం ఉన్న ఫామ్ ను పరిశీలిస్తే రెండు మూడు వన్డేల్లోనే ఆ రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశం కనిపిస్తోంది. సచిన్ టెండూల్కర్ 350 మ్యాచుల్లో ఈ మైలురాయిని అందుకోగా.. విరాట్ కోహ్లీ మాత్రం 202 వన్డేల్లోనే ఈ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.