తాను ఇంగ్లండ్ సిరీస్ లో చేసిన తప్పులను పునరావృతం చేయబోనని.. ఆట తీరును మెరుగుపరుచుకున్నానని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తాను పదేపదే ఒకే రకంగా ఔటవుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీని గురించి నెట్స్ లో తీవ్రంగా కష్టపడ్డానని.. వచ్చే సిరీస్‌ల్లో ఆ బలహీనతను అధిగమిస్తానని ధీమా వ్యక్తంచేశాడు.  


నెల రోజుల విరామం తర్వాత ఆగస్ట్ 27న యూఏఈలో ప్రారంభంకానున్న ఆసియా కప్ లో విరాట్ ఆడనున్నాడు. ఈ టోర్నమెంటులో తాను మునుపటిలా పరుగులు చేయగలనన్న విశ్వాసం వ్యక్తంచేశాడు. 


వరుస వైఫల్యాలు


ఇంగ్లండ్ తో సిరీస్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 6 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన టెస్టులో 20 పరుగులు చేశాడు. ఆ పర్యటనలో అదే విరాట్ అత్యధిక స్కోరు. గతాన్ని వదిలేసి తిరిగి గాడిలో పడడానికి కోహ్లీ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య విరాట్ శిక్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి తిరిగి ఫామ్ లోకి రావడానికి బాగా కష్టపడుతున్నట్లు అర్ధమవుతోంది. 


బలహీనతను అధిగమిస్తా


ఇంగ్లండ్ లో ఏం జరిగిందనేది అప్రస్తుతమని.. తాను ఆ వైఫల్యం నుంచి బయటకు రావడానికి శ్రమిస్తున్నట్లు ఈ మాజీ కెప్టెన్ చెప్పాడు. పదేపదే ఒకే విధంగా ఔటయ్యే బలహీనతను అధిగమించాల్సి ఉందని.. దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టినట్లు తెలిపాడు. బాగా ఆడతానని తనకు అనిపించినప్పుడు అంతా సవ్యంగానే ఉంటుందని.. తాను ఒకసారి ఫాంలోకి వస్తే బాగా బ్యాటింగ్ చేయగలనని చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్ లో తనకలా అనిపించలేదని చెప్పాడు. 


ఇంత దూరం ఊరికే రాలేదు
 
ఈ మధ్య కాలంలో కోహ్లీ తన బ్యాటింగ్ వైఫల్యం కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దాదాపు మూడేళ్లుగా సెంచరీ చేయలేదు. అప్పుడప్పుడు అర్ధశతకాలు సాధిస్తున్నా విరాట్ స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయడంలేదు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో విరాట్ మాట్లాడాడు. తన ఆట ఎలా ఉంటుందో తనకు తెలుసునని కోహ్లీ విమర్శకులకు బదులిచ్చాడు. వివిధ పరిస్థితులలో ఆడడం, రకరకాల బౌలింగ్ లను ఎదుర్కోవడం లాంటి సామర్థ్యం లేకుండా తాను అంతర్జాతీయ క్రికెట్ లో ఇంత దూరం రాలేదని తెలిపాడు. 






అయితే తాను ఈ పరిస్థితిని దాటి బయటకు రావాలనుకుంటున్నట్లు కోహ్లీ చెప్పాడు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఒక క్రీడాకారుడిగా తన విధి అని తెలిపాడు విరాట్. తాను ఈ దశ నుంచి బయటకు వచ్చాక ఎంత స్థిరంగా రాణించగలనో తనకు తెలుసునని ధీమాగా చెప్పాడు.