రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆసియా కప్ నకు సిద్ధమైంది. టైటిల్ ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో  ఆడే మ్యాచ్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వ్యక్తిగత రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ లో 27 మ్యాచులు ఆడిన రోహిత్.. మరో మ్యాచ్ ఆడితే ఆసియా కప్ లో అత్యధిక గేమ్ లు ఆడిన శ్రీలంక వెటరన్ బ్యాట్స్ మెన్ మహేలా జయవర్దనేను అధిగమిస్తాడు. ఆగస్టు 28న పాకిస్థాన్ తో జరిగే ఆసియాకప్ మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనత అందుకోనున్నాడు. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది.


ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయుడిగా  రోహిత్ ఉన్నాడు. 2008లో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్.. మొత్తం ఇప్పటివరకూ ఈ టోర్నమెంట్ లో 883 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 7 అర్ధ శతకాలు ఉన్నాయి.


శ్రీలంక మాజీ బ్యాట్స్ మెన్ మహేల జయవర్ధనే ఆసియా కప్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తం 28 మ్యాచ్ లు ఆడిన అతను.. 29.30 సగటుతో 674 పరుగులు చేశాడు. జయవర్దనే 2000లో ఆసియా కప్ లో అరంగేట్రం చేశాడు.


ఆసియాకప్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన షాహిద్ అఫ్రిది రెండో స్థానంలో నిలిచారు. 1997లో అఫ్రిది తన మొదటి మ్యాచ్ ఆడగా.. 2016లో చివరి మ్యాచ్ ఆడాడు. బంగ్లాదేశ్ వికెట్ కీపర్,  బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీమ్ 26 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక వెటరన్ బ్యాటర్ సనత జయసూర్య, బంగ్లా బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా 25 మ్యాచ్ లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, అరవింద డిసిల్వా 24 మ్యాచ్ లతో సంయుక్తంగా ఐదో స్థానాన్ని ఆక్రమించారు. 


ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ ఏడాది జరగబోతున్నది 15వ ఎడిషన్.  మొత్తం ఆరు జట్లు ఆసియా కప్ 2022లో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు టోర్నీకి నేరుగా ఎంపికయ్యాయి. మరో జట్టును క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. 


ఆసియా కప్‌కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్