ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రామాలయ (Ram Temple) ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా రానున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 6 నుంచి 8 వేల మంది అతిరధ మహారధులకు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ ట్రస్ట్ ఆహ్వానాలు పంపిందని సమాచారం. వారిలో భారత క్రికెట్‌కు చెందిన ప్రముఖులు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి ప్రముఖులు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా సచిన్ 100 శతకాలతో చరిత్ర సృష్టించాడు. 80 సెంచరీలతో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే వన్డే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడుగా మొన్నటి వరకు సచిన్ 49 సెంచరీలతో మొదటి వాడుగా ఉండగా తాజాగా జరిగిన ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ సచిన ముందే ఆ రికార్డు బద్దలు కొట్టాడు. గురువును మించిన శిష్యుడిగా మొదటి స్థానంలో నిలిచాడు.
దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. మందిరం నిర్మాణం ఇప్పటికే పూర్తి కావడంతో జనవరి 22న ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ హనుమంతుడు, అన్నపూర్ణ, మాతా శబరి, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, అగస్థ్య ముని నిషాద్ రాజ్, జటాయువు ఆలయాలు ఉంటాయి. ప్రధాన ఆలయం చుట్టూ.. కోటలా గోడ నిర్మించనున్నారు. అలాగే ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. అంతే కాకుండా స్తంభాలు, గోడలపై దేవతా విగ్రహాలను తయారు చేస్తున్నారు.
డిసెంబర్ 10 నుంచి భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సిరీస్ ప్రారంభం కానుంది. మూడు ఫార్మాట్లలో జరిగే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ముందుగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత వన్డే సిరీస్ జరగనుంది. 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ డిసెంబర్ 26 నుంచి జరుగుతుంది. తరువాత టీం ఇండియాకు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఉంది . సొంతగడ్డపై జరిగే ఈ టెస్ట్ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం ఎందుకంటే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టాప్-2లో నిలవాలంటే ఈ సీరీస్లో గెలవాల్సిందే. తొలి టెస్టు హైదరాబాద్‌లో, రెండో టెస్టు విశాఖపట్నంలో, మూడో టెస్టు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు రాంచీలో, ఐదో టెస్టు ధర్మశాలలో జరుగుతాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ పూర్తి కాగానే ఐపీఎల్-17 ప్రారంభం కానుంది.