Yuvraj Singh : టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) సాధించి..భారత్‌లో అడుగుపెట్టిన టీమిండియా(India) ఆటగాళ్ల అభిమానుల ప్రేమతో తడిసి ముద్దయ్యారు. బార్బడోస్‌ నుంచి వాంఖడే వరకూ భారత క్రికెటర్లు సాగించిన ప్రయాణం...అభిమానులకు జీవిత కాల జ్ఞాపకాలను అందించింది. ఈ ప్రపంచ కప్‌ విజయంతో దిగ్గజ ఆటగాళ్లు తమ కలను సాకారం చేసుకున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న అభిమానులకు ఉత్పన్నమవుతోంది. ట్రోఫీలను గెలుచుకోవడంలో టీమిండియాలో అత్యంత విజయవంతమైన ఆటగాడు ఎవరు అని. ఈ ప్రశ్నకు అందరూ క్రికెట్‌ గాడ్‌ సచిన్, ధోనీ, రోహిత్‌, విరాట్‌ కోహ్లీ పేర్లు చెప్తారు. కానీ ఐసీసీ(ICC) నిర్వహించిన అన్ని ట్రోఫీలతోపాటు ఐపీఎల్‌(IPL) ట్రోఫీని కూడా సాధించి... అన్ని ప్రతిష్టాత్మక ట్రోఫీలను సాధించిన జట్టులో భాగస్వామి అయిన కీలక ఆటగాడు ఒకరు ఉన్నారు. ఇంతకీ ఆ స్టార్‌ ఆటగాడు ఎవరో తెలుసా... ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh). ఇప్పటివరకూ యువీ మినహా ఏ భారత ఆటగాడు.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐసీసీ అన్ని ట్రోఫీలను... ఐపీఎల్‌ ట్రోఫీని సాధించలేదు. ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు యువరాజ్‌ సింగ్‌.
 

నిజంగా యువరాజే

టీమిండియాలో ఆల్‌రౌండర్‌గా యువరాజ్‌ సింగ్ సాగించిన ప్రస్థానం మాములుది కాదు. క్యాన్సర్‌తో పోరాడుతూ టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌ అందించిన యువీ... క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా జట్టులో స్థానం దక్కించుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. అయితే యువరాజ్‌ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన ఓ అరుదైన ఘనత మాత్రం ఇప్పటివరకూ మరో క్రికెటర్‌ ఎవరూ సాధించలేకపోయారు. యువరాజ్‌ తన కెరీర్‌లో టీ 20 ప్రపంచకప్‌...వన్డే వరల్డ్‌కప్‌... ఛాంపియన్స్‌ ట్రోఫీ... అండర్‌ 19 వరల్డ్‌ కప్‌.. ఐపీఎల్‌ ట్రోఫీలను సాధించాడు. ఇలా ప్రతిష్టాత్మకమైన అయిదు ట్రోఫీలను సాధించిన మరో భారత ఆటగాడు లేడు. 

 

మిగిలిన ఆటగాళ్లు ఇలా... 

మహేంద్ర సింగ్ ధోనీ... టీ 20 ప్రపంచకప్‌, వన్డే వరల్డ్‌కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించినా అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ను మాత్రం గెలవలేకపోయాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టీ 20 ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఐపీఎల్‌ ట్రోఫీలు సాధించినా అండర్‌ 19 వరల్డ్‌ కప్‌, వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీలను సాధించలేదు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీది ఒక భిన్నమైన కథ. విరాట్‌ కోహ్లీ ఐసీసీ నిర్వహించే పరిమిత ఓవర్ల ట్రోఫీలను అన్నింటిని గెలుచుకున్నాడు ఒక్క ఐపీఎల్ తప్ప. టీ 20 ప్రపంచకప్‌...వన్డే వరల్డ్‌కప్‌... ఛాంపియన్స్‌ ట్రోఫీ... అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లను కింగ్‌ గెలుచుకు్నాడు. కానీ విరాట్‌ ఐపీఎల్‌ ట్రోఫీను మాత్రం సాధించలేకపోయాడు. అందుకే యువరాజ్‌ను అందరూ పొగిడేస్తున్నారు. టీమిండియా టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఈ విషయం మరోసారి ట్రెండ్‌ అవుతోంది. యువీ ఆల్‌టైం గ్రేట్‌ అంటూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.