Virat Kohli Requested For A Break : హైదరాబాద్(Hyderabad) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India)కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు అనూహ్య ఓటమిని చవి చూసింది. భారత జట్టు 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టామ్ హార్టీలీ ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించి బ్రిటీష్ జట్టుకు అపూరూపమైన విజయాన్ని అందించాడు. భారత జట్టు ఓటమితో రోహిత్ సేన ఆటతీరుపై మాజీలు మండిపడ్డారు. ఇదేం ఆటతీరంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటికే రాహుల్, జడేజా రెండో టెస్ట్ నుంచి దూరమయ్యారు. అయితే తొలి రెండు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మిగిలిన టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వ్యక్తిగత కారణాలేనా..?
వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు ఇప్పటికే దూరమైన కోహ్లీ... తర్వాత జరుగబోయే మిగతా మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు అభిమానులను ఆందోళన పరుస్తున్నాయి. చివరి మూడు టెస్ట్‌లకు ఇవాళ టీమిండియాను ప్రకటించాల్సి ఉన్నా విరాట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కోహ్లి తల్లి సరోజ్ కోహ్లి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు, ఆమెను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి మిగతా టెస్ట్‌లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ నిజంగానే కోహ్లి ఇంగ్లండ్‌తో తదుపరి సిరీస్‌కు దూరమైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలినట్లే.
విశాఖలో భారత జట్టు
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు విశాఖ వేదికగా జరగనుంది. ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీన ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆటగాళ్లు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. వీరంతా బుధ, గురువారాల్లో ప్రాక్టీస్ చేయనున్నారు. తొలి టెస్టులో అనూహ్యంగా భారత్ జట్టు ఓటమిపాలు కావడంతో లోపాలపై దృష్టి సారించి వాటిని సరి చేసుకునేలా ప్రాక్టీస్‌కు ఆటగాళ్లు ఎక్కువ సమయాన్ని కేటాయించనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన ఆటగాళ్లు బస్సుల్లో భారీ భద్రత నడుమ నోవాటెల్‌కు చేరుకున్నారు. బుధవారం ఉదయం స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేయనునున్నారు. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా మంగళవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. క్రికెట్ సంఘం అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా బుధవారం సాయంత్రం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఒత్తిడి భారత్‌పైనే
ఇంగ్లాండ్ ఎప్పట మాదిరిగానే బజ్ బాల్ వ్యూహంతోనే రెండో టెస్టులో బరిలోకి దిగే చాన్స్ ఉంది. ఆది నుంచి దూకుడుగా ఆడి భారీ స్కోర్ చేసే లక్ష్యంతో ఇంగ్లాండ్ ఉంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే ఇంగ్లాండ్‌ను కట్టడి చేసేందుకు అవకాశముంటుంది. ఏమాత్రం అదును దొరికినా ఇంగ్లాండ్ బ్యాటర్లు విజృంభించే చాన్స్ ఉంది. ఓపెనర్లతోపాటు బెయిర్ స్టో, బెన్ స్టో టచ్‌లో ఉన్నారు. వీరికి కుదురుకునే చాన్స్ ఇస్తే మాత్రం భారత్ ముందు భారీ స్కోరును ఉంచే ప్రమాదముంది. కాబట్టి, వీరిని త్వరితగతిన ఔట్ చేస్తేనే ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది.