Ind Vs Eng 2nd Test In Vizag: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు విశాఖ వేదికగా జరగనుంది. ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీన ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆటగాళ్లు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. వీరంతా బుధ, గురువారాల్లో ప్రాక్టీస్ చేయనున్నారు. తొలి టెస్టులో అనూహ్యంగా భారత్ జట్టు ఓటమిపాలు కావడంతో లోపాలపై దృష్టి సారించి వాటిని సరి చేసుకునేలా ప్రాక్టీస్‌కు ఆటగాళ్లు ఎక్కువ సమయాన్ని కేటాయించనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన ఆటగాళ్లు బస్సుల్లో భారీ భద్రత నడుమ నోవాటెల్‌కు చేరుకున్నారు. బుధవారం ఉదయం స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేయనునున్నారు. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా మంగళవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. క్రికెట్ సంఘం అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా బుధవారం సాయంత్రం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించే అవకాశం ఉంది.
మార్పులు.. చేర్పులకు అవకాశం
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలు కావడం భారత జట్టును కొంత నిరాశకు గురి చేసి ఉంటుది. ఓటమి నుంచి కోలుకుని గెలుపు బాట పట్టాల్సిన బాధ్యత భారత ఆటగాళ్లపై ఉంది. తొలి టెస్టు విజయం ఇంగ్లాండ్ జట్టులో ఉత్సాహాన్ని నింపుతుండగా, భారత ఆటగాళ్లను ఒత్తిడికి గురి చేస్తోంది. స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక తొలి టెస్టులో చతికిలపడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కీలక ఆటగాళ్లు చేతులెత్తేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తితంది. ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాళ్లు ఔటైనా.. పోప్ ఒక్కడే అద్భుత పోరాటంతో జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు. అటువంటి పోరాటం భారత ఆటగాళ్లలో ఒక్కరూ కూడా చేయలేకపోయారు. ఆ పోరాట పటిమ లేకపోవడంతోనే ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు స్వల్ప మార్పులతో బరిలోకి దిగేందుకు భారత్ జట్టు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. తొలి టెస్టు ఆడిన జడేజా స్థానంలో కుల్దీప్‌కు అవకాశం కల్పించే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఇంగ్లాండ్ మాదిరిగా ఒకే పేసర్‌తో బరిలోకి దిగాలని భారత్ భావిస్తే సిరాజ్‌పై వేటు పడే అవకాశముంది. ఇక బ్యాటింగ్ విభాగంలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. మిడిలార్డర్‌ను పటిష్టం చేసేందుకు రజత్ పటీదార్, సర్పరాజ్‌ల్లో ఒకరికి అరంగేట్రం చాన్స్ లభించవచ్చని చెబుతున్నారు.
ఒత్తిడి భారత్‌పైనే
ఇంగ్లాండ్ ఎప్పట మాదిరిగానే బజ్ బాల్ వ్యూహంతోనే రెండో టెస్టులో బరిలోకి దిగే చాన్స్ ఉంది. ఆది నుంచి దూకుడుగా ఆడి భారీ స్కోర్ చేసే లక్ష్యంతో ఇంగ్లాండ్ ఉంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే ఇంగ్లాండ్‌ను కట్టడి చేసేందుకు అవకాశముంటుంది. ఏమాత్రం అదును దొరికినా ఇంగ్లాండ్ బ్యాటర్లు విజృంభించే చాన్స్ ఉంది. ఓపెనర్లతోపాటు బెయిర్ స్టో, బెన్ స్టో టచ్‌లో ఉన్నారు. వీరికి కుదురుకునే చాన్స్ ఇస్తే మాత్రం భారత్ ముందు భారీ స్కోరును ఉంచే ప్రమాదముంది. కాబట్టి, వీరిని త్వరితగతిన ఔట్ చేస్తేనే ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది.