Virat Retirement: ఆటాడేవాళ్లుంటారు.. వేటాడేవాళ్లుంటారు. ఆటలో వేటాడే యోధులు అరుదుగా ఉంటారు. ఆటను ఆటాడుకున్న అలాంటి వాడొకడున్నాడు.. ఆ ఆట పేరు క్రికెట్ అయితే.. ఆ వేట పేరు విరాట్ కోహ్లీ.. The Most Fierce…Finisher Virat Kohli. ఇంత బిల్డప్ అవసరమా.. ? అతను ఆల్‌టైమ్ గ్రేటా అని అడిగేవాళ్లు చాలామంది ఉండొచ్చు. దానిపై చాలా చర్చ జరగొచ్చు. కానీ ఆధునిక క్రికెట్‌లో అన్నీ ఫార్మాట్‌లలో అతనికి లేరు సాటి.. పోటీ.. !
టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ గుడ్‌బై.. మోడ్రన్ టెస్ట్ క్రికెట్‌ను రీ డిఫైన్ చేసిన ప్లేయర్లలో ఒకడైన విరాట్ అలా సింపుల్‌గా సైలంట్‌గా వెళ్లిపోతాడని ఏ క్రికెట్ అభిమాని కూడా ఊహించలేదు. అచ్చమైన ఆటకు అసలైన ప్లేయర్ వీడ్కోలు చెప్పడం ఎవరికి నచ్చుతుంది…?ఓ ఆటగాడు వెళ్లిపోతే ఈ స్థాయిలో పొగడ్తలు అవసరమా.. క్రికెట్‌లో ఇంతకంటే వస్తాదుల్లేరా అని చాలామందికి కంప్లెయింట్ ఉండొచ్చు. డాన్ బ్రాడ్‌మన్ కన్నా పెద్దోడా.. గ్యారీ సోబర్స్ కన్నా గొప్పోడా.. బ్రియాన్ లారా కన్నా బ్రిలియంటా.. లేక ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ లేని రికార్డును సృష్టించిన క్రికెట్ దేవుడు.. సచిన్ కన్నా గొప్పోడా.. అనొచ్చు. వాళ్లందరితో పోలిక కాదు. ఆ మాటకొస్తే.. కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే తీసుకుంటే అతనితో సమఉజ్జీలుగా నిలిచే స్మిత్, రూట్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న క్రికెట్‌లో వేల మంది అంతర్దాతీయ క్రికటెర్లు వచ్చారు. అందులో గ్రేటెస్ట్‌లు చాలా మందున్నారు. మరెందుకు విరాట్ గురించి అంటే చెప్పుకోవడానికి చాలా ఉంది.
విరాట్‌రూపం..
ఇండియాలో క్రికెట్ అనేది ఎమోషన్.. కోట్లామందిని కలిపే భావోద్వేగం.. కోట్లమందికి ఆరాద్యుడైన సచిన్‌లో అలాంటి ఎమోషన్ లేదు. కానీ విరాట్ Full of Emotions. ఇంకా చెప్పాలంటే.. నేటి ఆధునిక భారతీయ క్రికెట్‌కు అతను ముఖచిత్రం. 82 అంతర్జాతీయ సెంచరీలో… 27 వేల పరుగులో.. కాదు విరాట్ అంటే…! లేదా ఇప్పుడు టెస్టుల నుంచి రిటైరయ్యాడు కాబట్టి.. ౩౦ సెంచరీలు.. ౩1 ఆఫ్ సెంటరీలు.. 9230 పరుగులు , ఇండియాలో టాప్ -4 టెస్ట్ టాపర్ ఇలాంటివి కూడా కాదు. విరాట్ అంటే అతని ఆటిట్యూడ్..! అడ్డకొట్టుడు.. దంచికొట్టుళ్లే రివాజైన పొట్టి క్రికెట్ జమానాలో అసలైన క్రికెట్ అంటే ఏంటో చూపించడం మామూలు విషయం కాదు కదా.. తన కళాత్మకమైన ఆటతో టెస్ట్ క్రికెట్‌కు కళ తెచ్చినవాడు. అందరికీ ఉన్నట్లే.. విరాట్‌కు క్రికెట్‌లో ఓ బలహీనత ఉంది. అది మినహా అతను పర్‌ఫెక్ట్ టెక్నిక్ ప్లేయర్. లెజండరీ సునీల్ గవాస్కర్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి గొప్ప టెస్ట్ ప్లేయర్లతో సమానంగా ఈ నాటి క్రికెటర్లు రాణించాలంటే అది విరాట్ అయితేనే సాధ్యం.
అద్భుత.మైన రికార్డులు
ఒక చిన్న కుర్రాడిగా ఇండియన్ వైట్స్‌తో రెడ్‌బాల్ క్రికెట్ మొదలుపెట్టి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా , ఆటగాడిగా కెరీర్ ముగించేవరకూ విరాట్ జర్నీ అద్భుతం. ఎందరికో ఇన్సిరేషన్. ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గానూ అతను మోస్ట్ సక్సెస్‌ఫుల్
- కెప్టెన్‌గా తన మొట్టమొదటి టెస్టులోనే రెండు సెంచరీలు చేశాడు విరాట్. గ్రెగ్ చాపల్ తర్వాత ఆ రికార్డు కేవలం కోహ్లికి మాత్రమే ఉంది.
- ఇండియా తరపున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ (7 డబుల్ సెంచరీలు) విరాట్ కోహ్లీ..
- ఇండియాకు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించింది కూడా విరాటే.. 68టెస్టులకు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ధోనీ 60టెస్టులు కెప్టెన్సీ చేశాడు.
- ఇండియాకు టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ 68 టెస్టుల్లో 40 విజయాలు 58%Success కూడా విరాట్ కోహ్లీనే…
- ఇండియన్ టీమ్ అంటే.. స్పిన్.. కెప్టెన్లు నమ్ముకునేది వాళ్లనే అనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ…. ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ దమ్ము ప్రపంచానికి పరిచయం చేసిన వాడు కోహ్లీ. టెస్టుల్లో 20వికెట్లు తీయాలన్న ఐడియాతో ముందుకెళ్లిన వాడు.. బుమ్మా, షమీ, ఇషాంత్ శర్మ కోహ్లీ కెప్టెన్సీలో చెలరేగిపోయారు. కోహ్లీ నాయకత్వంలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్లు 591 వికెట్లు తీశారు.
- ఒకే సిరిస్‌లో 4 సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్. 2016-17 ఇంగ్లండ్ సిరిస్
- 2018-19 లో దాదాపు 80 ఏళ్ల తర్వాత ఓ ఆసియా టీమ్.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌లో ఓడించింది. ఆ అరుదైన ఘనత కోహ్లికి దక్కింది.
- భారత్ తరపున విదేశాల్లో సెంచరీ చేసిన తొలి చివరి కెప్టెన్ కూడా విరాటే.. కెప్టెన్‌గా తన మొదటి వెస్టిండీస్ సిరీస్‌ను గెలిచి ఎన్నో దశాబ్దాల తర్వాత భారత్‌కు వెస్ట్ ఇండియన్ దీవుల్లో కప్పును అందించిన విరాట్.. ఆ సిరిస్ మొదటి టెస్టులో 200 స్కోర్ చేశాడు
G.O.A.T
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ G.O.A.T అంటాం. ముఖ్యంగా క్రీడల్లో ఉపయోగించే ఈ మాటను అత్యంత ప్రతిభ చూపిన వాళ్లకే ఉపయోగిస్తాం. ఒక ఆటగాడిగా అతనికున్న రికార్డులే అతనేంటో చెబుతాయి. వర్థమాన క్రికెట్‌లో దాదాపు అసాధ్యం అనుకునే సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల ఫీట్‌ను బ్రేక్ చేయగలిగినవాడు విరాట్ అని అంతా విశ్వసించారు. ఈవెన్ సచిన్ కూడా అది విరాట్ కు మాత్రమే సాధ్యం అని చెప్పాడు. ఏమైనా విరాట్ నిష్క్రమణతో ఆ రికార్డ్ పదిలంగా ఉండే అవకాశాలున్నాయి. తక్కవ టెస్టులు , వన్డేలు జరుగుతున్న తరుణంలో 82 సెంచరీలు చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఒక్కో ఆటగాడికి ఒక్కో తరహా ఇమేజ్ ఉంటుంది. టెస్ట్, వన్డే ప్లేయర్లు అని... అయితే టెస్టు, వన్డే, టీ-20 , IPL ఇలా అన్నింటిలో అంతే ఇంపాక్ట్ ఇచ్చింది వన్ అండ్ ఓన్లీ కోహ్లీ. ఈ మూడు ఫార్మాట్లలో ICC No.1 గా నిలిచింది one and Only కోహ్లీనే. ఆ తర్వాత ఈ ఫీట్ ఉంది.... మన బౌలర్ బుమ్రాకు.. !
గెలవాలనే తెగింపు..
ఇండియన్ క్రికెట్ రూపరేఖలను మార్చిన కెప్టెన్‌గా సౌరభ్ గంగూలీని చెబుతారు. దానిని కొనసాగించనవాడు... ధోనీ... ఇక కోహ్లీ అయితే ఆట యాటిట్యూడ్‌నే మార్చేశాడు. అది అనేక సందర్బాల్లో కనిపించింది. అతని రికార్డుల్లో చూపిస్తోంది. 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. తాను ఆటగాడిగా ఓడిపోయింది.. ౩1టెస్టుల్లో మాత్రమే . ఇందులో మిగతా ఆటగాళ్ల పాత్ర ఉన్నా.. ప్రధాన ఆటగాడిగా కోహ్లీ ఎన్నో టెస్టులు గెలిపించాడు. ఇక కెప్టెన్‌గా 68 టెస్టులకు నాయకత్వం వహించిన విరాట్ ఓడిపోయింది 17 టెస్టులు మాత్రమే. ఇది మోస్ట్ సక్సెస్‌ఫుల్ రేట్. 2021 లో ఇంగ్లండ్‌లో అప్పటికే రెండు టెస్టులను కోల్పోయిన భారత్ తిరిగి పుంజుకుని సిరీస్‌ను కూడా కొట్టగలిగిందంటే.. అది కోహ్లీకున్న కసే. విరాట్ అప్పటి టీమ్‌ను ఎలా మోటివేట్ చేశాడో... స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. Let’s go on the Rampage, Let’s Give them Hell.. ఇదీ అతని వరుస.. ఏదైనా ముఖాముఖీ తేల్చేసుకోవడమే
సాధించగలిగే నేర్పే కాదు.. వదిలేయగలిగే ధైర్యం కూడా
విరాట్ అంటేనే ధైర్యం .. అందుకే తన మొదటి టెస్టులోనే అప్పటికే అత్యంత సీనియర్ , ధోనికి క్లోజ్ కూడా అయినటువంటి అశ్విన్‌ను కాదని కరణ్ శర్మను పిక్ చేశాడు. తనను పక్కన పెడుతున్నాడని గ్రహించి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న గంగూలీతోనే గొడవకు దిగాడు. అంతెందుకు తనను వన్డే క్రికెట్ కెప్టెన్‌గా తప్పిస్తున్నారని ముందే తెలిసిపోయింది అతనికి.. కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో టెస్ట్ కెప్టెన్సీ కూడా నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు. కొంత కాలం కెప్టెన్ గా చేసి ఉంటే.. ఇండియా తరపునే కాదు.. ప్రపంచంలోనే అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ అయ్యుండే వాడు. 10వేల క్లబ్ అన్నది ఏ ఆటగాడికైనా ఓ డ్రీమ్. దానికి దగ్గరలో ఉండి కూడా టెస్ట్ క్రికెట్‌ను వదిలేశాడు. అంతెందుకు ఇప్పుడు విరాట్ రిటైర్మెంట్‌ను బీసీసీఐ ఒప్పుకోకపోయినా.. అతను మాట వినలేదు. విరాట్ కోరుకుంటే.. టెస్ట్ క్రికెట్‌కు తాను ఇచ్చిన దానికి బీసీసీఐ ఓ ఘనమైన వీడ్కోలు ఇచ్చేది. కానీ తాను మాత్రం సైలంట్‌గా సైడైపోయాడు..
ఫాల్ డౌన్
ఏ ఆటగాడిపైనా ఫాల్ అన్నది తప్పదు. విరాట్ దానికి అతీతుడు కాదు.. అన్నీ గొప్పలేనా.. తప్పులు లేవా అంటే ఉన్నాయి. ఇంతటి గ్రేట్ బ్యాట్స్‌మన్ అయినా అవుట్ సైడ్ ఆఫ్ వెళ్లే బాల్‌ను కెలికి అవుటవ్వడం విరాట్ బలహీనత. ఎక్కువ సార్లు కాట్ బిహైండ్, పస్ట్ స్లిప్‌లోనే దొరికిపోతాడు. ఆ బలహీనతతో ఓ ఆస్ట్రేలియా సిరిస్, ఇంగ్లండ్ సిరిస్ లో సరిగ్గా ఆడలేకపోయాడు. ఆ బలహీనత నుంచి పట్టుదలతో బయటపడి.. ఆస్ట్రేలియాలోనే సెంచరీలు కొట్టాడు. అయితే 2022 లో కెప్టెన్సీ వదిలేసినప్పటి నుంచి విరాట్ డౌన్ ఫాల్ మొదలైంది. 2014-18 లో కెరీర్ పీక్స్ లో దాదాపు 70 పరుగుల యావరేజ్ ఉన్న అతను లాస్ట్ ౩ ఏళ్లలో ముప్పైల్లోకి వచ్చేశాడు. ఇక వదిలేయాలిసిన తరుణం వచ్చిందని అతనికి తెలుసు.
వైట్ ఇండియన్ జెర్సీలో... పలుచని దేహంతో బౌండరీలైన్ దాటుతూ లోపలకు వచ్చే ఆ చిరుతను మళ్లీ మనం అలా గ్రౌండ్‌లో చూడలేకపోవచ్చు. ఆద్భుతమైన విరాట్ ఇన్నింగ్స్‌లు చూసిన అడిలెడ్, ఆంటిగ్వా, నాటింగ్ హామ్, పెర్త్, జోహెన్సస్‌బర్గ్ లు ఇక ఆ ఆటను ఆస్వాదించలేకపోవచ్చు. ధనాధన్ బ్యాటింగ్‌ల కాలంలో ఐదురోజుల క్రికెట్ ను ఇండియాలో ఆకర్షణీయంగా మార్చేసిన వాడు .. టెస్ట్ మ్యూచ్‌లకు కూడా స్టేడియంకు జనాలను పుల్ చేసిన వాడు.. అతను. అందుకే గ్రేటర్, గ్రెటెస్ట్‌లు ఎంత మంది ఉన్నా.. విరాట్ విరాటే. ఆట.. మాట.. ఒకే రీతిలో సాగిన వాడు.. అంతటి ప్రైడ్‌కు చాలా మంది ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్, లావు కృష్ణదేవరాయలు అన్నట్లు His legacy far beyond the numbers..
విరాట్ ఇంకా పూర్తిగా ఆటను వదిలేయలేదు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోనే ఉన్నాడు. అయితే అసలైన క్రికెట్ ను వదిలేశాడు. అంటే పూర్తి అస్త్రసన్యాసానికి ఇది ఆఖరి మజిలీ అన్నమాట. ఓ యోధుడి ఆఖరి మజిలీ.. ఈ రిటైర్మెంట్.