విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరిగిన ODI సిరీస్‌లో విరాట్ కోహ్లీ 302 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించాడు. కోహ్లీ వరుసగా 2 మ్యాచ్‌లలో సెంచరీలు, చివరి వన్డేలో అర్ధ శతకం చేశాడు. వన్డే సిరీస్‌లో ఈ ప్రదర్శనకు గాను రన్ మేషిన్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. దీనితో పాటు, విరాట్ మరో ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. ఇప్పుడు పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
ఇప్పుడు పురుషుల క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇది విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 20వ సారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు కోహ్లీ. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 19 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు.
అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్లు:
- 20 సార్లు - విరాట్ కోహ్లీ
- 19 సార్లు - సచిన్ టెండూల్కర్
- 17 సార్లు - షకీబ్ అల్ హసన్
- 14 సార్లు - జాక్వెస్ కలిస్
- 13 సార్లు - సనత్ జయసూర్య
- 13 సార్లు - డేవిడ్ వార్నర్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 4 వన్డే ఇన్నింగ్స్‌లలో కింగ్ కోహ్లీ 374 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతకు ముందు రెండు వన్డేల్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. తీవ్ర నిరాశ పరిచాడనుకున్న సమయంలో కోహ్లీ సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 9వ సారి వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో 50 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ ఇప్పుడు తన అంతర్జాతీయ కెరీర్‌లో 28,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 25 పరుగులు దూరంలో ఉన్నాడు. 2025లో భారత జట్టుకు వన్డే మ్యాచ్‌లు లేవు. కనుక కోహ్లీ ఈ రికార్డును నెలకొల్పడానికి వచ్చే ఏడాది వరకు వేచి ఉండాలి.
Also Read: Yashasvi Jaiswal Century: వన్డేల్లో యశస్వి జైస్వాల్ తొలి సెంచరీ.. అరుదైన జాబితాలో చేరిన భారత్ ఓపెనర్
విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. క్వింటన్ డికాక్ సెంచరీ చేశాడు. ఇటు భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ద్ కృష్ణ చెరో 4 వికెట్లతో చెలరేగారు. భారత్ 40 ఓవర్లలోపే టార్గెట్ ఊదేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ సెంచరీ(116 నాటౌట్)కి తోడు రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65) నాటౌట్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు.